కేసీఆర్ మాస్టర్ ప్లాన్ : మండలిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం దక్కేనా

  • Published By: madhu ,Published On : February 23, 2019 / 02:17 PM IST
కేసీఆర్ మాస్టర్ ప్లాన్ : మండలిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం దక్కేనా

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకునేందుకు సీఎం కేసీఆర్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. 4 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మరో స్థానాన్ని వ్యూహాత్మకంగా ఎంఐఎంకు అప్పగించారు. మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, సత్యవతి రాథోడ్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించిన కేసీఆర్.. ఒక స్థానాన్ని ఎంఐఎంకు వదిలేశారు.

నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో కలిసి తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 120 మంది సభ్యులున్నారు. ఒక ఎమ్మెల్సీ సభ్యుడు గెలవడానికి 21 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు 90 మంది సభ్యులున్నారు. ఎంఐఎంకు 7గురు సభ్యులున్నారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 98 సభ్యులున్నారు.

రెండో ప్రాధాన్యతా ఓట్లతో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి 5 స్థానాలనూ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అటు కాంగ్రెస్‌కు రెండో ప్రాధాన్యత ఓట్లు వేసే అవకాశం లేదు. టీడీపీకి ఇద్దరు సభ్యులున్నా, సండ్ర వెంకట వీరయ్య.. ఇప్పటికే టీఆర్ఎస్‌ వైపు చూస్తున్నారు.

మొదటి, రెండో ప్రాధాన్యతా ఓట్లు వేయడంలో తమ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలని టీఆర్ఎస్‌ యోచిస్తోంది. 5 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకొని మండలిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేకుండా చేయాలని టీఆర్ఎస్‌ భావిస్తోంది.