మున్సిపల్ ఎన్నికలు : టీఆర్‌ఎస్‌లో టికెట్ల సందడి 

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో అధికార టీఆర్‌ఎస్‌లో టికెట్ల సందడి మొదలైంది. ఎవరి వర్గానికి వారు టిక్కెట్లు దక్కించుకునేందుకు చేస్తున్న నేతల ప్రయత్నాలు గ్రూప్ తగాదాలకు తెరదీస్తున్నాయి.

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 02:05 AM IST
మున్సిపల్ ఎన్నికలు : టీఆర్‌ఎస్‌లో టికెట్ల సందడి 

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో అధికార టీఆర్‌ఎస్‌లో టికెట్ల సందడి మొదలైంది. ఎవరి వర్గానికి వారు టిక్కెట్లు దక్కించుకునేందుకు చేస్తున్న నేతల ప్రయత్నాలు గ్రూప్ తగాదాలకు తెరదీస్తున్నాయి.

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో అధికార టీఆర్‌ఎస్‌లో టికెట్ల సందడి మొదలైంది. ఎవరి వర్గానికి వారు టిక్కెట్లు దక్కించుకునేందుకు చేస్తున్న నేతల ప్రయత్నాలు గ్రూప్ తగాదాలకు తెరదీస్తున్నాయి. దీంతో నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఇంచార్జ్ లను రంగంలోకి దింపింది. గ్రూప్ తగాదాలకు చెక్ పెడుతూ నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు నిన్న మొన్నటి వరకు తారా స్థాయిలో కనిపించింది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు నియోజకవర్గంలో గత ఆరు నెలలుగా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఇద్దరిని సమన్వయం చేసేందుకు హైకమాండ్ తాండూరు ఇంచార్జ్ గా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నియమించింది. 

తెలంగాణా భవన్ లో తాండూరు నియోజకవర్గ పార్టీ నేతలతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. టిక్కెట్ల పంపిణీపై నెలకొన్న వివాదాలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి చర్చించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి దాదాపు టిక్కెట్ల ఖరారును పూర్తి చేశారు. అన్ని వర్గాలకు టీఆర్ఎస్ న్యాయం చేస్తుందని.. టిక్కెట్లు రాని వారు ఆవేశ పడొద్దని సూచించారు. ఎవరైనా పార్టీని కాదని స్వతంత్రంగా పోటీ చేయాలనుకుంటే వారే నష్టపోతారని మంత్రి హెచ్చరించారు. 

నేతల మధ్య సమన్వయం కోసం మంత్రి తలసాని చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. టిక్కెట్ల ఖరారుపై ఎమ్మెల్యేతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని.. అందరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

తాండూర్ లో నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. అందరం కలిసి తాండూరు అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. టిక్కెట్ దక్కని వారికి కూడా న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. 

మొత్తంగా తలసాని జోక్యంతో తాండూరు పంచాయితీని ఓ కొలిక్కి తీసుకొచ్చిన అధిష్టానం అన్ని ప్రాంతాల్లో ఇదే ఫార్ములాను అమలు చేయాలని భావిస్తోంది. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు సీనియర్ నేతలతో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.