ప్రజాదర్బార్ నిర్వహించనున్న గవర్నర్

  • Published By: chvmurthy ,Published On : January 21, 2020 / 01:40 AM IST
ప్రజాదర్బార్ నిర్వహించనున్న గవర్నర్

TS-governor-tamilisai

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సాధక బాధకాలు తెలుసుకుని వాటిని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని తద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలని గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ నిర్ణయించారు. రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో నెలకోసారి ప్రజాదర్బార్  నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం రాజ్ భవన్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.  ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులకు పరిష్కారం లభించిందా? అవి ఏ దశలో ఉన్నాయి?  ఏ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయి? తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కొత్త ఫైల్‌ ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను రాజ్‌భవన్‌ సచివాలయం రూపొందిస్తోంది. రాజ్‌భవన్‌ సచివాలయం అన్ని ప్రభుత్వ శాఖలతో అనుసంధానమై పనిచేసే విధంగా ఈ సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు. నెల రోజుల్లో ఏర్పాట్లు పూర్తికానున్నాయని, ఆ తర్వాత గవర్నర్‌ ప్రజాదర్బార్‌ నిర్వహణ తేదీని ప్రకటిస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 

సీఎం కేసీఆర్ ప్రజలను కలుసుకోవటంలేదని   ప్రజలు తమ సమస్యలు తెలియ చేసేందుకు వేదిక లేకుండా పోయిందని  మీరైనా ప్రజా దర్బార్ నిర్వహించాలని ఎంబీటీ నేత అంజాదుల్లా ఖాన్ ట్విట్టర్ లో గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.  దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించి ప్రజా దర్బార్ పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని ఈ అంశం తన పరిశీలనలో ఉందని గతేడాది ట్విట్టర్ లో ప్రకటించారు. ఆ తర్వాత మరో రెండు దఫాల్లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తానని ప్రకటన చేశారు. ఆ దిశగా రాజ్‌భవన్‌ సచివాలయం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 

వైఎస్‌తో ప్రారంభమై…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో 2004కు ముందు ముఖ్యమంత్రులు సాధారణ ప్రజలను నేరుగా కలిసి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించే వ్యవస్థ లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2004లో ఆయన లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు 7 నెలల పాటు ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఆ తర్వాత గ్రీన్‌ల్యాండ్స్‌లో కొత్త నివాసం ఏర్పాటు చేసుకున్నాక ఐదేళ్ల పాటు ఆయన సాధారణ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని వారి వద్ద నుంచి విజ్ఞప్తులు స్వీకరించేవారు. వైఎస్ మరణం తర్వాత సీఎంగా పనిచేసిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాదర్బార్‌ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. పాత సీఎం క్యాంపు కార్యాలయం వాస్తు ప్రకారం లేకపోవడంతో కొత్త కార్యాలయం కట్టుకున్న తర్వాత కేసీఆర్‌ ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది.

ప్రగతి భవన్‌ నిర్మాణం పూర్తైనా సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం లేకుండా పోయింది. సీఎంను కలసి తమ సమస్యలను వినిపించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రగతిభవన్‌కు వచ్చే సాధారణ ప్రజలను అక్కడి భద్రత సిబ్బంది ‘సీఎం అపాయింట్‌మెంట్‌’లేదని పేర్కొంటూ వెనక్కి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించాలని నిర్ణయించడం రాజకీయంగా ప్రత్యేకత సంతరించుకుంది. కాగా… గవర్నర్లు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తే ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఎన్నడూ గవర్నర్లు ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకున్న సందర్భాలు సైతం లేవని గుర్తు చేస్తున్నాయి.