ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధం

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 03:27 PM IST
ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధం

హైదరాబాద్ : పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీగా ఐఏఎస్‌ల బదిలీలు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు కొందరు అధికారులకు పోస్టింగ్ ఇస్తూ.. మరోవైపు బదిలీలకు రంగం సిద్ధం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధం అవుతుందా అంటే అవున‌నే అంటున్నాయి తెలంగాణ స‌చివాల‌య వ‌ర్గాలు. గ‌త నాలుగైదు రోజులుగా సెక్ర‌టేరియ‌ట్ లో ప్ర‌తి ఒక్క శాఖ‌లోని అధికారులు బ‌దిలీలు ఎప్పుడంటూ జీఏడీ అధికారుల‌ను ఎంక్వ‌యిరీ చేయ‌డం మొద‌లుపెట్టారు. దీంతో వివిధ‌ శాఖలకు చెందిన ముఖ్యకార్యదర్శులు, సెక్రటరీలు, పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. 

భారీగానే ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని సెక్రటేరియట్ ఉన్నతాధికారుల మధ్య చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం ఏ ఐఏఎస్ ఏఏ శాఖల్లో పని చేస్తున్నారు? ఎన్ని ఏళ్ల నుంచి విధుల్లో ఉన్నారు? జిల్లా కలెక్టర్ల వివరాలు ఇవ్వాలని ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వెళ్లగా.. జీఏడీ అధికారులు పూర్తి వివరాలు అందించారు. దీంతో ఐఏఎస్ ల బదిలీలు పక్కాగా వుంటాయనే చర్చ సెక్రటేరియట్ ఉన్నతాధికారుల మధ్య జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం కొందరు అధికారుల‌కు పోస్టింగ్ లు ఇచ్చారు. విద్యాశాఖ కార్యదర్శిగా జనార్ధన్‌రెడ్డిని నియమించారు. మూడు జిల్లాలకు కొత్త కలెక్టర్లను కేటాయించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా మస్రత్‌ ఖనమ్‌ అయేషా, ములుగు కలెక్టర్‌గా నారాయణరెడ్డి, నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా ఎస్‌ వెంకటరావు, హైద్రాబాద్ క‌లెక్టర్‌గా మాణిక్ రాజును నియమించారు. 

చాలా మంది ఐఏఎస్ అధికారులు ఒకటి కంటే ఎక్కువ శాఖల భాద్యతలు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 208 మంది ఐఏఎస్‌లు ఉండాలి. అయితే.. కేవలం 154 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో చాలా మంది ట్రైనింగ్ లో ఉన్నారు. కొందరు ఐఏఎస్ అధికారులు ఒకటి కంటే ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తూ ఒత్తిడికి లోనవుతుంటే.. మరికొందరికి పెద్దగా పనిలేదనే చెప్పాలి. మొత్తానికి ఐఏఎస్‌ల జాబితా తెప్పించుకున్న ప్రగతి భవన్‌ వర్గాలు.. త్వరలోనే బదిలీలకు శ్రీకారం చుట్టనున్నాయి.