ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

  • Published By: chvmurthy ,Published On : January 14, 2020 / 12:34 PM IST
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

తెలంగాణ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లకు జరిగే ఎన్నికల నామినేషన్లకు ఉపసంహరణ గడువు మంగళవారం జనవరి 14, మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను మరి కొద్ది సేపట్లో  ప్రకటించనున్నారు. ఈ నెల 22న పోలింగ్‌, 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

మొత్తం వార్డులు, డివిజన్లు కలిపి 3,052 స్థానాలకు 25,768 నామినేషన్లు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.  వీటిలో 432 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 25,336 నామినేషన్లు చెల్లుబాటయ్యాయని, 19,673 మంది బరిలో నిలిచారని ఎస్‌ఈసీ ప్రకటించింది. ఉపసంహరణ తర్వాత ఎంతమంది బరిలో ఉన్నారనేది మంగళవారం సాయంత్రానికి ఎన్నికల సంఘం ప్రకటించనుంది. మరో వైపు రాజకీయ పార్టీల తరపున అభ్యర్థులకు అధికారికంగా బీ ఫారాలు అందజేసే గడువు కూడా ఈరోజుతో ముగిసింది. అధికార పార్టీకి రెబల్స్‌ బెడద తప్పలేదు.  అనేక చోట్ల టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ బరిలో ఉన్నారు.  టీఆర్‌ఎస్‌ నుంచి అధికంగా 8,956మంది నామినేషన్లు దాఖలు చేశారు. తరువాత స్థానాల్లో కాంగ్రెస్‌ (5,356 మంది), బీజేపీ (4,176 మంది) పార్టీ అభ్యర్థులు నిలిచారు.  

కామారెడ్డిలో ఆందోళన
కామారెడ్డి మున్సిపల్‌ నామినేషన్‌ విత్‌డ్రా సెంటర్‌ వద్ద కాంగ్రెస్‌ ఆశావాహులు ఆందోళనకు దిగారు. కౌన్సిలర్‌ సీట్లను అమ్ముకున్నారని అభ్యర్థులు ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెదక్‌ మున్సిపాలిటీ 16వ వార్డులో ముందు చంద్రకళ అనే మహిళకు బీ ఫారం ఇచ్చిన కాంగ్రెస్‌.. తర్వాత అదే వార్డుకు చెందిన టీఆర్‌ఎస్‌ రెబల్‌ వసంత రాజ్‌కు బీ పార్మ్‌ అందించింది. దీంతో కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి తన బి ఫారంను కాంగ్రెస్‌ను నేత శేఖర్‌ చించేశాడు. దీంతో శేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.