బీజేపీ లక్ష్మణ్ దీక్ష భగ్నం.. అరెస్ట్ 

  • Published By: chvmurthy ,Published On : April 29, 2019 / 10:37 AM IST
బీజేపీ లక్ష్మణ్ దీక్ష భగ్నం.. అరెస్ట్ 

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు  సోమవారం భగ్నం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన లక్ష్మణ్‌ను పోలీసులు అక్కడ్నించి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో పోలీసులు.. బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇంటర్‌ పరీక్షలు రాసిన 9 లక్షల మంది పేపర్లను రీ-వాల్యూయేషన్‌ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ తప్పుల తడకగా ఉందని లక్ష్మణ్ ఆరోపించారు.   ఇంటర్ బోర్డులో జరిగిన తప్పులపై జ్యూడిషియల్ విచారణ చేపట్టాలని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరాహార దీక్ష చేస్తానని ఆయన  అన్నారు. 

ప్రభుత్వం నిర్బంధగా వ్యవహరిస్తోంది, మా ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీ ని హౌస్ అరెస్టు చేశారు. ప్రభుత్వ అవలంబిస్తున్న చర్యలకు భయపడేది లేదని లక్ష్మణ్ అన్నారు. అంతకుముందు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగిన పలువురు ప్రతి పక్ష నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ టీడీపీ నేతలెవరిని బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.  పలు చోట్ల అఖిలపక్ష నాయకల్ని పోలీసులు గృహనిర్బంధం చేశారు.  ఎక్కడికక్కడ నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.