పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు : కనీస చార్జీ రూ. 10 

  • Published By: chvmurthy ,Published On : December 3, 2019 / 01:57 AM IST
పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు : కనీస చార్జీ రూ. 10 

తెలంగాణ ఆర్టీసీ టికెట్ల రేట్లకు రెక్కలొచ్చాయి. పల్లె వెలుగు నుండి గరుడ ప్లస్ వరకు అన్ని బస్సుల్లోనూ టికెట్ల ధరలు పెరిగాయి. కిలో మీటర్‌కు 20 పైసలు చొప్పున పెరిగింది. అటు బస్సు పాసుల రేట్లు కూడా మారిపోయాయి. కొత్త ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చేసాయి. ఈ పెంపుతో ఆర్టీసీకి ఏడాదికి సుమారు 750 కోట్ల మేర ఆదాయం సమకూరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంధనం, విడి భాగాలు, టైర్ల ధరలు పెరగడంతో సంస్థపై అదనపు భారం పడుతోందని.. ఈ క్రమంలోనే  బస్సు చార్జీల పెంపు అనివార్యమైందని ఆర్టీసీ చెబుతోంది. వాస్తవంగా ఆర్టీసీలో పెంచిన ఛార్జీలను వాస్తవానికి సోమవారం నుంచే అమల్లోకి తీసుకురావాలని అధికారులు భావించారు. కానీ, టికెట్ రేట్ల ఖరారు, టికెట్ మిషన్లలో వాటి అప్‌డేట్ లాంటి ప్రక్రియలు ఉండటంతో ఒక రోజు వాయిదా పడింది. వాటన్నింటినీ సరిచేశాక… అర్ధరాత్రి నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి వచ్చింది. 

52 రోజుల సుదీర్ఘ సమ్మె అనంతరం కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీ మనుగడ కొనసాగించాలంటే ఛార్జీల పెంపు తప్పదని స్పష్టం చేశారు. కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే.. పెంచింది 20 పైసలే అయినా.. అదే లెక్క ప్రకారం వసూలు చేస్తే చిల్లరకు ఇబ్బందులు తప్పవు. అందువల్ల వీటిని రౌండప్ చేశారు. ఇందులో భాగంగా సిటీ, పల్లె వెలుగు బస్సుల్లో కనీసం ఛార్జీలను 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు.. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో అయితే 10 నుంచి 15కు పెంచారు. డీలక్స్ బస్సుల్లో ఇరవై, సూపర్ లగ్జరీల్లో.. 25 రూపాయలకు పెంచారు. రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్ ఏపీ బస్సుల్లో.. కనీస చార్జీని 35 రూపాయలకు పెంచారు. ఇదే లెక్కన ప్రతి 4 స్టాపులకు 5 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోయారు. చిల్లర సమస్య రాకుండా ఇలా చేస్తున్నా.. ప్రయాణికుల జేబులకు పెద్ద చిల్లే పడింది. 

గ్రేటర్ పరిధిలోని ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కనీస చార్జీ 10 రూపాయలకు పెంచగా.. గరిష్ఠ చార్జీని 30 నుంచి 35కు చేశారు. మెట్రో డీలక్స్ లో మాత్రం.. కనీస చార్జీని 10 నుంచి 15కు, గరిష్ఠ చార్జీని 30 నుంచి 45కు పెంచారు. గ్రేటర్ పరిధిలో బస్ పాసుల రేట్లు కూడా అమాంతం పెరిగాయి. జనరల్ బస్ పాస్ 770 నుంచి 950కి పెంచారు. మెట్రో బస్ పాస్ 880 నుంచి వెయ్యి డెబ్భై రూపాయలకు సవరించారు. డీలక్స్ బస్ పాస్ 990 నుంచి 11 వందల 85 రూపాయలకు పెంచారు. స్టూడెంట్ రూట్‌ పాస్‌లలో.. కనీసంగా 35 రూపాయలు పెంచారు.  అయితే.. గ్రేటర్ పరిధిలో ఒక్క ఏసీ బస్సుల చార్జీలు మాత్రం పెంచలేదు.

ఆర్డినరీ బస్సులో.. దిల్ సుఖ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు ఇప్పటివరకు 15 రూపాయల టికెట్ ఉంటే… ఇప్పుడు 20 రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తోంది. సికింద్రాబాద్ నుంచి కేపీహెచ్‌బీకి కూడా 20 రూపాయలైంది. మెట్రో బస్ సర్వీసులో ఐతే.. అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు ఇంతకు ముందు 15 రూపాయలుండగా… ఇప్పుడు 20 రూపాయలైంది. కోఠి నుంచి సికింద్రాబాద్ కు 15 రూపాయలుగా ఉన్న చార్జీ.. 20కి పెరిగింది. 

చార్జీల పెంపుతో.. తెలంగాణలోని ప్రధాన రూట్లలో చార్జీలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నుంచి రాయిచూర్, కరీంనగర్, హన్మకొండ, నిజామాబాద్, ఖమ్మం ఎక్స్‌ప్రెస్ రూట్లలో.. కనీసం 35 నుంచి 40 రూపాయల చార్జీ పెరిగింది. హైదరాబాద్ నుంచి గరుడ ప్లస్ బస్సులో బెంగళూరుకు గతంలో వేయీ10 రూపాయలుంటే.. ప్రస్తుతం 1290 రూపాయలైంది. అంటే 280 రూపాయలు పెరిగింది. పూణేకు వెళ్లాలంటే 1500 రూపాయలవుతోంది. షిర్డీకి 1610 రూపాయలైంది. అంటే 365 రూపాయలు పెరిగింది.