TRS పాలనకు రెండేళ్లు : ప్రతిరంగంలోనూ అద్భుత ప్రగతి

  • Published By: madhu ,Published On : December 13, 2020 / 08:16 AM IST
TRS పాలనకు రెండేళ్లు : ప్రతిరంగంలోనూ అద్భుత ప్రగతి

Two years of TRS govt : 2018 డిసెంబర్‌ 13. రెండేళ్ల క్రితం ఇదేరోజున… టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ పాలనకు 2020, డిసెంబర్ 13వ తేదీ శనివారంతో రెండేళ్లు పూర్తయ్యాయి. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రభాగాన నిలిచిన కేసీఆర్‌ పాలనకు.. ప్రజలు రెండోసారి పట్టంకట్టారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…ఈ రెండేళ్లో సంక్షేమాన్ని డబుల్‌ చేసింది. కరోనా కాలంలోనూ సంక్షేమాన్ని ఆపకపోవడమే ఇందుకు నిదర్శనం.

సాహసోతే నిర్ణయాలు : –
సర్కారు సంస్కరణలు అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించాయి. రెండేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో… ప్రతి రంగంలోనూ అద్భుతమైన ప్రగతే కనిపిస్తుంది. కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి నూతన రెవెన్యూచట్టం ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ.. ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంతో భూ లావాదేవీలు అత్యంత సులభంగా, అవినీతి రహితంగా సాగాలన్న కేసీఆర్‌ కల సాకారమైంది. కొత్త రెవెన్యూ చట్టం ఆధారంగా రూపొందిన ధరణి పోర్టల్‌ను అక్టోబర్‌ 29న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అప్పటి నుంచి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేపట్టారు. ఇప్పటివరకు 56 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వ్యవసాయేతర భూముల స్లాట్‌ బుకింగ్స్‌ మొదలుకాగా.. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

నూతన మున్సిపల్ చట్టం : –
కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న మరో కీలక నిర్ణయం.. నూతన మున్సిపల్‌ చట్టం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రూపురేఖలు మార్చడమే కాకుండా పౌరసేవలను మరింత బాధ్యతాయుతంగా అందించేలా ఈ చట్టం రూపుదిద్దుకున్నది. కొత్తగా ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 76 మున్సిపాలిటీలను ఏర్పాటుచేసి పురపాలనలో విప్లవాత్మక అడుగువేసింది. పట్టణప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛపట్టణ నిర్మాణానికి ఊతమిచ్చింది.
కేసీఆర్‌ పాలనలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కింది. హైదరాబాద్‌ కేంద్రంగా దేశంలోనే అగ్రగామిగా వెలుగొందుతున్న ఐటీ.. ఇప్పుడు జిల్లాలకు విస్తరించింది. ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన కంపెనీలు ఇప్పుడు పల్లె బాట పట్టాయి.

సంస్కరణలు – సంక్షేమం : –
ఇప్పటికే హైదరాబాద్‌ తర్వాత ఐటీ విస్తరించిన తొలి జిల్లాగా వరంగల్‌ రికార్డు సృష్టించింది. కరీనంగర్‌, ఖమ్మంలోనూ ఐటీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లలోనూ ఐటీ టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. సిద్దిపేట జిల్లాలోనూ ఐటీ టవర్‌కు బీజం పడింది. రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు జాతీయ సగటును మించాయి. సరైన నాయకత్వం ఉంటే… రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ మాటలు తెలంగాణలో అక్షరాలా నిజమయ్యాయి. విజన్‌ కలిగిన సీఎం కేసీఆర్‌ దీర్ఘదృష్టితో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ.. రాష్ట్రం పురోగమిస్తోంది. నియంత్రిత సాగుతో అన్నదాతకు సర్కార్‌ అండ లభించింది. రైతు వేదికలతో తమ గోడును వెల్లబోసుకోవడమేకాదు… పంటకు గిట్టుబాటు ధరను చూపే దారి దొరికింది. ఇక ఆర్టీసీలో కార్గో సేవలు కేసీఆర్‌ వినూత్న ఆలోచనకు ప్రతిరూపంగా నిలిచింది. ఇలా ఏరంగాన్ని తీసుకున్నా.. సంస్కరణలు, – సంక్షేమం జోడెడ్లుగా టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధితో దూసుకెళ్తోంది.