ఓటర్ జాబితాలో పేరు ఉందా : ఓటర్ హెల్ప్ లైన్ యాప్

  • Published By: madhu ,Published On : February 28, 2019 / 01:50 AM IST
ఓటర్ జాబితాలో పేరు ఉందా : ఓటర్ హెల్ప్ లైన్ యాప్

త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎమ్మెల్సీ, లోక్ సభ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఓట్లర జాబితాను ఫైనల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా తమ ఓటు లేదని, దొంగ ఓట్లు నమోదు చేశారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్ల పేరు జాబితాలో లేదని రాజకీయ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఓ యాప్‌ని రూపొందించారు. ‘ఓటర్ హెల్ప్ లైన్’ పేరిట యాప్ అందుబాటులోకి తెచ్చారు. దీనిని ఉపయోగించి తమ పేరు ఉందో లేదో తెలుసుకొనే ఛాన్స్ ఉంది. స్మార్ట్ ఫోన్‌లోనే ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. 

ఈ యాప్‌లో ఏమున్నాయంటే : 
* గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘ఓటర్ హెల్ప్ లైన్’ యాప్‌ని డౌన్ లౌడ్ చేసుకోవాలి. అది ఓపెన్ కాగానే పేరు, తండ్రి పేరు తదితర వివరాలు టైప్ చేస్తే జాబితాలో పేరు ఉందో లేదో తెలిసిపోతుంది. 
* ఓటు హక్కు లేకపోతే ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ, తొలగింపులు, సవరణలు కూడా చేసుకొనే వీలు కల్పించారు. 
* ఈవీఎం, వీవీ ప్యాట్‌లకు సంబంధించి అవగాహన కోసం వీడియోలను ఇందులో పొందుపరిచారు. 
* ఇటీవలే జరిగిన ఎన్నికలు, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు 2014 ఎన్నికల వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాల వివరాలు తెలుసుకోవచ్చు.
* హెల్ప్ లైన్ నంబర్‌తో ఎన్నికల సంఘం సిబ్బంది మాట్లాడొచ్చు. అభ్యంతరాలు ఉన్నా..ఫిర్యాదులున్నా వారి దృష్టికి తీసుక రావచ్చు. 
* ఏదైనా ఫిర్యాదులు చేస్తే అది ఎంతవరకు వచ్చిందనేది కూడా చూపిస్తుంది.