యూట్యూబ్‌లో షర్మిలపై అసభ్యకర కామెంట్స్ : వ్యక్తి అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 01:49 AM IST
యూట్యూబ్‌లో షర్మిలపై అసభ్యకర కామెంట్స్ : వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: జగన్‌ సోదరి, వైసీపీ నేత షర్మిలపై యూట్యూబ్‌లో అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్‌ చేసిన వ్యక్తిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం(మార్చి 25, 219) అమరావతిలో షర్మిల మీడియాతో మాట్లాడుతుండగా ఓ టీవీలో లైవ్ లో వచ్చింది. అదే సమయంలో దివి హరిబాబు (39) అనే వ్యక్తి 3 సార్లు అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశాడు. షర్మిలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల మండలి వైస్‌చైర్మన్‌ అనిల్‌ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. కంప్యూటర్‌ ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ వ్యక్తి దివి హరిబాబుగా గుర్తించారు. చౌటుప్పల్‌ రామ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన హరిబాబు రాయదుర్గం ప్రాంతంలోని ఓ లేబొరేటరీలో పనిచేశాడని పోలీసులు తెలుసుకున్నారు. ఆ వివరాల ఆధారంగా చౌటుప్పల్‌లో అతడిని అరెస్టు చేశారు. హరిబాబు స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు. ప్రస్తుతం చౌటుప్పల్‌ సమీపంలో తంగెడిపల్లిలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు.

యూట్యూబ్ లో తనపై అసభ్యకరమైన వీడియోలు పెడుతున్నారని ఇదివరకే షర్మిల సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికల సమయంలోనే తన గురించి, తన కుటుంబం గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపంచారు. దీని వెనుక టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుల హస్తం ఉందని షర్మిల ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు యూట్యూబ్ ఛానళ్ల నిర్వహాకులకు నోటీసులు ఇవ్వడం, పలువురిని అరెస్ట్ చేయడం తెలిసిందే.