జీతాలు పెంచుతారా, ఆందోళన చేయమంటారా – GHMC డ్రైవర్ల అల్టీమేటం

  • Published By: madhu ,Published On : December 11, 2020 / 07:00 AM IST
జీతాలు పెంచుతారా, ఆందోళన చేయమంటారా – GHMC డ్రైవర్ల అల్టీమేటం

GHMC Transport Section drivers : వారంతా రోజూ చెత్తను తరలించే కార్మికులు. హైదరాబాద్‌ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారిది కీలకపాత్ర. దుర్గంధాన్ని సైతం భరిస్తూ… చెత్తను శివారులోని డంపింగ్ యార్డులకు చేరుస్తున్న ఆ కార్మికులు అన్యాయానికి గురవుతున్నారు. న్యాయం కోసం ఆందోళనకు సిద్ధమయ్యారు. జీహెచ్‌ఎంసీ కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలు.. కొంతమందిలో ఆనందాన్ని కలిగిస్తే.. మరికొంత మందికి బాధను మిగిల్చాయి. పారిశుద్ద్య కార్మికులు, ఎంటమాలజీ విభాగంలో పనిచేస్తోన్న వర్కర్లు, ఆయా విభాగాల సూపర్‌ వైజర్లకు వేతనాలు పెరిగాయి.



ఒక్కొక్కరికి 3వేల చొప్పున పెంచింది ప్రభుత్వం. దీంతో వీరంతా ఖుషీగా ఉన్నారు. ఇక బల్దియాలో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి మాత్రం వేతనాలు పెరగలేదు. దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదన్నట్టుగా.. కొంతమంది అధికారుల తీరే తమకు వేతనాలు పెరగకపోవడానికి కారణమని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
జీహెచ్ఎంసి ట్రాన్స్ పోర్టు విభాగంలో హెల్పర్లుగా పనిచేసే వర్కర్లకు మాత్రం 17వేల రూపాయలు చేసిన ప్రభుత్వం….. అందులో పనిచేసే డ్రైవర్లకు మాత్రం వేతనాలు పెంచలేదు.



దీంతో డ్రైవర్‌కు హెల్పర్‌గా పనిచేసే కార్మికుడికి 17వేలు చెల్లిస్తోంది బల్దియా. కానీ ఆ బండిని నడిపే డ్రైవర్‌కు మాత్రం 15వేల రూపాయలే ఇస్తోంది. దీంతో హెల్పర్‌కు రెండు వేలు పెంచడం మంచిదే కానీ… తమకు తక్కువ ఇవ్వడమేంటని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. తమకూ వేతనాలు పెంచాలని, నెలకు 25వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం మూడువేల మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ పెరిగిన వేతనాలు ఇవ్వడం లేదు. ఇదే అంశాన్ని వారంతా మేయర్‌ దృష్టికి తీసుకెళ్లారు. డ్రైవర్ల విజ్ఞప్తిని పరిశీలిస్తామని.. మేయర్‌ వారికి హామీనిచ్చారు. తమకూ వేతనాలు పెంచాలని.. లేకుంటే ఆందోళనకు దిగుతామని డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు.