బ్రేకింగ్ : నిండిన హుస్సేన్ సాగర్..నీరు విడుదల

  • Published By: madhu ,Published On : September 26, 2019 / 02:33 AM IST
బ్రేకింగ్ : నిండిన హుస్సేన్ సాగర్..నీరు విడుదల

నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా తలపిస్తోంది. భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రమాదకరస్థాయిలో నిండిపోయింది. కాలనీల నుంచి కాల్వల ద్వారా వస్తున్న నీళ్లు సాగర్‌లోకి చేరుతుండడం..వర్షాలు పడుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా..ప్రస్తుతం 512.10 మీటర్లుగా ఉంది. సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఉదయం సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేదని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

గత కొన్ని రోజులుగా నగరంలో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎగువ ప్రాంతం నుంచి భారీగా సాగర్‌కు వరద నీరు పోటెత్తింది. గురు, శుక్రవారాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. హుస్సేన్ సాగర్ నీటి పరిస్థితిపై సమీక్షించారు. కొంత నీరు చేరుకుంటే..నీరు బయటకు పొంగి పొర్లే అవకాశాలున్నాయని భావించిన అధికారులు..నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. 

2016 ఆగస్టులో నగరంలో భారీ వర్షం కురవడంతో హుస్సేన్ సాగర్ ప్రమాదకరస్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. 2001లో భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్ దిగువ ప్రాంతాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే. 
Read More : నగరంలో వదలని వాన : జనజీవనం అస్తవ్యస్తం