వర్షాల కారణంగా రెండు రోజలు సెలవు

  • Published By: murthy ,Published On : October 14, 2020 / 01:21 PM IST
వర్షాల కారణంగా రెండు రోజలు సెలవు

telangana:రాష్ట్ర వ్యాప్తంగా గ‌త రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలకు తెలంగాణ త‌డిసి ముద్దైంది. పలు ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగి ఇళ్లలోకి నీరు వచ్చాయి. కుండపోతగా కురుస్తున్న వానల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎస్ ఆదేశించారు.




అత్య‌వ‌స‌ర‌మైతే తప్ప, ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావద్దని ప్ర‌భుత్వం సూచించింది. పిల్ల‌లు, వృద్ధులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరింది. పాత భ‌వ‌నాల‌ను త‌క్ష‌ణ‌మే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని తెలిపింది. రాష్ర్ట వ్యాప్తంగా క‌లెక్ట‌ర్ల‌ను, పోలీసు శాఖ‌ను ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం చేసింది.

హైదరాబాద్ లోని చాంద్రాయణ గుట్ట, ఫలక్ నుమా, బండ్ల గూడ వెళ్లే దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ఫలక్ నుమా రైల్వే వంతెన వైపు రాకపోకలపై నిషేధం విధించారు. వర్షాల ధాటికి వరద నీటిలో అల్ జుబేర్ కాలనీకి ఓ మహిళ మృత‌దేహం కొట్టుకువచ్చింది.




హిమాయత్ సాగర్ జలాశయం 14 గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదలటంతో మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. దీంతో మూసీ నది పరివాహాక ప్రాంతంలో ఇళ్లు నిర్నించుకున్న ప్రాంతాల్లో భారీగా నీరు వచ్చ చేరింది. మూసీ పరివాహాక ప్రాంతంతలోని చాదర్ ఘాట్ ప్రాంతంలో 10 అడుగుల మేర నీరు వచ్చి చేరింది.

అనేక కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటి పైభాగంలోకి చేరుకుని కాలం గడుపుతున్నాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది,జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిర్వాసితులను సమీపంలోని ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

మియాపూర్ ప్రకాశ్ నగర్ లో చెరువు పొంగిపొర్లుతోంది. దీంతో అక్కడి అమ్మవారి గుడి కూలిపోయింది. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవేపై రాకపోకలపై నిషేధం విధించారు. ఓల్డ్ బోయినపల్లి వికాస్ నగర్ లో రాయల్ ఎన్ క్లేవ్ ను వరదనీరు చుట్టుముట్టింది. దీంతో నిత్యావసరాలు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.




అంబర్ పేట నుంచి ఓయూకి వెళ్లే శివం రోడ్డులో ఓ భారీ వృక్షం కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  అల్వాల్ భూదేవినగర్ లో ఇళ్లలోకి నీరు చేరింది. పాతబస్తీలో ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు.

ఉప్ప‌ల్ నుంచి ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ నుంచి కోఠి రోడ్లు మూసివేశారు. కాచిగూడ రైల్వేష్టేష‌న్‌లో ప‌ట్టాల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచింది. నిజాంపేట‌తో పాటు బండారి లేఅవుట్ లో భారీగా నీరు నిలిచింది. భారీ వరద ధాటికి సమీపంలో ఉన్న అప్పాచెరువు కట్టతెగి గగన్ పహాడ్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి కోతకు గురైంది.

దీంతో రహదారిలో వెళ్తున్న కార్లు కొట్టుపోవడతో దాదాపు 30 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురి మృత‌దేహాలు లభ్యమయ్యాయి. భారీ వర్షాల కారణంగా నగరంలో పలుచోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపట్టారు.