రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

  • Published By: chvmurthy ,Published On : April 26, 2019 / 02:39 PM IST
రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

హైదరాబాద్: హిందూమహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో  ఏర్పడిన వాయుగుండం శ్రీలంకకు తూర్పు ఆగ్నేయ దిశగా 1090 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయ దిశగా 1440 కిలోమీటర్లు, మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 1720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటలలో ఇది తీవ్ర వాయుగుండముగాను, తదుపరి 12 గంటలలో తుఫానుగాను మారే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావర కేంద్రం అధికారులు తెలిపారు. తదుపరి 96 గంటలలో ఇది శ్రీలంక తీర ప్రాంతం వెంబడి వాయువ్య దిశగా ప్రయాణించి ఏప్రిల్ 30 వ తేదీ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాల దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. 

మరో వైపు తెలంగాణ నుండి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్లు ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వలన తెలంగాణలో రాగల మూడు రోజులలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎల్లుండి కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

కోస్తా ఆంధ్రలో ఈరోజు రాత్రికి  రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు  గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అధికారులు వివరించారు. ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో  రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.