Zero FIR అంటే : పోలీస్ స్టేషన్ ఏదైనా ఫిర్యాదు చేయండి ఇలా

  • Published By: veegamteam ,Published On : December 3, 2019 / 10:01 AM IST
Zero FIR అంటే : పోలీస్ స్టేషన్ ఏదైనా ఫిర్యాదు చేయండి ఇలా

శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నలుగురు మృగాళ్లు అత్యాచారం జరిపి అత్యంత పాశవింగా దిశను చంపేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ నలుగురు నరరూప రాక్షసులను తక్షణమే ఉరి తీయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే వెటర్నరీ డాక్టర్ దిశకు ఈ దుస్థితి పట్టడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణం అనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే డాక్టర్ దిశ ప్రాణాలతో ఉండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మా అమ్మాయి కనిపించడం లేదు అని ఫిర్యాదు చేసేందుకు డాక్టర్ దిశ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళితే.. వారికి చేదు అనుభవం ఎదురైంది. ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పిన పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. మరో పోలీస్ స్టేషన్ కి వెళ్లండి అని ఉచిత సలహా ఇచ్చి దిశ పేరెంట్స్ ను పంపేశారు. దీంతో ఆలస్యమైపోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

దిశ తల్లిదండ్రులు మరో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసే సరికి దారుణం జరిగిపోయింది. మృగాళ్ల చేతిలో దిశ ప్రాణాలు కోల్పోయింది. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆపద సమయంలో ఇలా తమ పరిధిలోకి రాదు అంటూ పోలీసులు చెప్పడం ఏంటని మండిపడుతున్నారు. ఈ లోపాన్ని సరిదిద్దాలనే డిమాండ్ వినిపిస్తోంది. దిశ ఘటనలో… తమ పరిధి కాదంటూ దిశ పేరేంట్స్ నుంచి ఫిర్యాదు తిరస్కరించారన్న ఆరోపణలపై ముగ్గురు పోలీసులను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

దిశ ఘటన నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో పరిధి పేరుతో ఫిర్యాదు నిరాకరిస్తున్న అంశం చర్చనీయాంశమైంది. దీంతో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జీరో ఎఫ్ఐఆర్ ని తెరపైకి తెచ్చారు. దిశ ఘటన తర్వాత జీరో ఎఫ్ఐఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? దాని వల్ల లాభం ఏంటి? బాధితులకు ఏ విధంగా సాయ పడుతుంది? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం జీరో ఎఫ్ఐఆర్.

జీరో ఎఫ్ఐఆర్ అంటే:
* పోలీస్ స్టేషన్‌ పరిధితో నిమిత్తం లేకుండా తమకు సమీపంలో ఉండే ఏ పోలీస్ స్టేషన్‌కైనా బాదితులు సాయం కోసం వెళ్లొచ్చు. 
* అక్కడి పోలీసులు ఫిర్యాదు తీసుకుని సంబంధిత స్టేషన్‌కు సమాచారం అందజేయాలి. 
* తక్షణమే బాధితులకు తగిన సాయం అందజేయాలి. 
* పోలీస్ స్టేషన్లలో ప్రతి ఏటా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ వరుస నంబర్లతో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తుంటారు. 
* జీరో ఎఫ్‌ఐఆర్‌లో నంబర్‌ ఇవ్వకుండానే కేసు నమోదు చేస్తారు.

ఎవరైనా బాధితులు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ, న్యాయం కోసం సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే మీ ప్రాంతం మా పరిధి కాదు అని పోలీసులు నిరాకరిస్తుంటారు. ఇది చాలామందికి అనుభవమై ఉంటుంది. బాధితులు తమ నివాసం ఏ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని, ఫిర్యాదు చేసే లోపు ఘోరాలు జరిగిపోతుంటాయి. ప్రాణాలు పోతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని గతంలో ఉత్తరప్రదేశ్, కర్నాటక హైకోర్టులు తీర్పులు ఇచ్చాయి. ఇది అన్ని రాష్ట్రాల పోలీసు మాన్యువల్‌లోనూ ఉంది. అయినా ఎక్కడా అమలు కావడం లేదు. కాగా దిశ ఘటన తర్వాత పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో జీరో ఎఫ్ఐఆర్ మరోసారి తెరపైకి వచ్చింది. 

ప్రతి పౌరుడు జీరో ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకోవాలి. అవగాహన ఏర్పరచుకోవాలి. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కు వెళ్లినప్పుడు.. మా పరిధిలోకి రాదు అని పోలీసులు తప్పించుకోవడానికి వీల్లేదు. ఆ సమయంలో జీరో ఎఫ్ఐఆర్ గురించి చెబితే.. ఇక పోలీసులు తప్పించుకోలేరు. కచ్చితంగా ఫిర్యాదు తీసుకోవాల్సిందే, విచారణ చేపట్టాల్సిందే.

దిశ ఘటన తర్వాత అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. ఆయా కేసుల ప్రాధాన్యం, తీవ్రతను బట్టి పరిధులతో సంబంధం లేకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీస్‌ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారిని పరిధుల పేరుతో తిరస్కరించకుండా.. కేసు పెట్టదగిన తీవ్రమైన నేరాలకు సంబంధించి తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు.