ఇండియాలో క‌రోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది, ట్రయల్స్‌ ఎంతవరకు వచ్చాయి, మే వరకు ఆగాల్సిందేనా

  • Published By: naveen ,Published On : November 7, 2020 / 12:55 PM IST
ఇండియాలో క‌రోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది, ట్రయల్స్‌ ఎంతవరకు వచ్చాయి, మే వరకు ఆగాల్సిందేనా

coronavirus vaccine: వ్యాక్సిన్.. ఇప్పుడీ మాట కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ప్రపంచ దేశాలు కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం శాయశక్తులూ ఒడ్డుతున్నాయి. మరి మన దేశంలో క‌రోనా వాక్సిన్ ఎప్పుడొస్తుంది.. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ఎంత వరకు వచ్చాయి..?

12 సెంట‌ర్లలో కోవాక్సిన్ క్లినిక‌ల్ ట్రయల్స్ :
భారతదేశంలో కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ జోరుమీదున్నాయి. భార‌త్ బ‌యోటెక్ ఆధ్వర్యంలో 12 సెంట‌ర్లలో కోవాక్సిన్ క్లినిక‌ల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని సెంట‌ర్లలో కోవాక్సిన్ మూడో ద‌శ క్లినిక‌ల్ ట్రయ‌ల్స్‌ మొదలయ్యాయి. తెలంగాణలో కూడా మూడో దశ వ్యాక్సిన్‌ ప్రయోగాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ ట్రయ‌ల్స్‌కి స‌న్నద్ధమవుతున్నారు.


మూడో దశకు క్లినిక‌ల్ ట్రయ‌ల్స్:
ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన రెండు ద‌శ‌ల టీకా ప్రయోగాలు సక్సెస్‌ అయ్యాయ. దీంతో దేశంలో క్లినిక‌ల్ ట్రయ‌ల్స్ మూడో ద‌శ‌కు చేరుకున్నాయి. రెండో దశ టీకా ట్రయల్స్‌లో ఆరోగ్యంగా ఉన్న వాలంటీర్లపై ప్రయోగం జ‌రిగింది. మూడో ద‌శ‌లో పెద్ద మొత్తంలో క‌రోనా పేషెంట్లపైన కూడా ఈ వాక్సిన్ ప్రయోగించే అవ‌కాశం ఉంటుంది. మొత్తం 12 ఆస్పత్రుల్లో కోవాక్సిన్ హ్యూమ‌న్ క్లినిక‌ల్ ట్రయ‌ల్స్ మొదల‌య్యాయి. తెలంగాణలోని నిమ్స్ ఆస్పత్రిలో థ‌ర్డ్ ఫేస్ క్లినిక‌ల్ ట్రయ‌ల్స్ నవంబర్ 14 త‌రువాత ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒక‌టి, రెండు ఫేస్‌లు పూర్తి చేసిన నిమ్స్ వైద్యులు.. 100 మంది ఆరోగ్యవంతుల‌కు ఇప్పటికే వాక్సిన్ డోస్ ఇచ్చారు. వారంతా ఆరోగ్యంగా ఉండ‌టంతో పాటు యాంటీబాడీలు కూడా వృద్ధి చెందిన‌ట్లుగా వైద్యులు చెబుతున్నారు.

మూడోదశ ట్రయల్స్‌కు ఎథిక్స్‌ కమిటీ అనుమతి కోసం వెయిటింగ్:
అయితే ఇప్పుడు మూడోదశ ట్రయల్స్‌కు ఎథిక్స్‌ కమిటీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల మందికి టీకాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నిమ్స్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న పేషెంట్లకి కూడా ఈ వాక్సిన్ ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. 28 రోజుల తర్వాత మరోసారి వారికి బూస్టర్ ‌డోస్‌ ఇస్తారు. 90 రోజుల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు. వీరిపై ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు పర్యవేక్షణ ఉంటుంది. ఆ తరువాత వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్టు స‌మాచారం.