రెండు దశాబ్దాల తర్వాత తెల్లవీపు రాబందులు

  • Published By: madhu ,Published On : October 27, 2019 / 04:38 AM IST
రెండు దశాబ్దాల తర్వాత తెల్లవీపు రాబందులు

అంతరించిపోతున్న తెల్లవీపు రాబందుల మనుగడపై కేంద్ర అటవీ శాఖ పరిధిలోని సెంట్రల్ జూ అథార్టీ దృష్టి పెట్టింది. సీసీఎంబీ (కణ జీవశాస్త్ర పరిశోధన సంస్థ)కి అనుబంధంగా ఉన్న లాకూన్స్ (అంతరించిపోతున్న జంతు జాతుల పరిరక్షణ సంస్థ) సహకారంతో హైదరాబాద్ జంతు ప్రదర్శనశాలలో ఈ జాతి సంతతిని పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించింది. మహారాష్ట్ర గడ్చిరౌలి ప్రాంతంలో 50 నుంచి 60 వరకు తెల్లవీపు రాబందులున్నట్లు గుర్తించారు. మూడు నెలల క్రితం లాకూన్స్ శాస్త్రవేత్తలతో కూడిన బృందంతో కలిసి తెలంగాణ అటవీ శాఖ అధికారులు అక్కడకు వెళ్లారు.

ఐదు జతలు కావాలని అక్కడి రాష్ట్ర అటవీ శాఖను కోరారు. అక్కడి నుంచి తెచ్చిన అనంతరం జంతు ప్రదర్శనశాలలో వీటి సంతతిని పెంచి కాగజ్ నగర్ సహా..ఇతర అటవీ ప్రాంతాల్లో వదలాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. రాబందులు షెడ్యూల్ 1 జాతికి చెందినవి కావడంతో వీటిని తరలించాలంటే కేంద్రం ఆమోదం తప్పనిసరి. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం..కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే ఇక్కడకు తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు అటవీ రేంజ్ పాలరపుగుట్టలో ఉణ్న పొడుగుమూతి రకం రాబందులుతో పోలిస్తే..తెల్లవీపు రాబందులు ప్రత్యేకమైనవని అటవీశాఖ అధికారి వివరించారు. 
Read More : ట్రాఫిక్ కష్టాలకు చెక్ : ఐటీ కారిడార్‌కు భారీ ఊరట