తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ? 

  • Published By: chvmurthy ,Published On : March 3, 2020 / 06:49 PM IST
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ? 

అదిగో ఇదిగో.. అంటూ  రాష్ట్ర అధ్యక్ష పదవి ఊరిస్తోంది. ఆలస్యం చేస్తూ ఆశావహులను ఉసూరు మనిపిస్తోంది. ఇక ఇప్పట్లో పదవి దక్కేది లేదులే అని నిట్టూరుస్తున్న సమయంలో ఢిల్లీ నుంచి ఓ టీమ్‌ ఫ్లయిట్‌ వేసుకొని దిగింది. అంతే మళ్లీ పోతున్న ప్రాణం తిరిగొచ్చినట్టయ్యింది. అయితే ఇక్కడే ఓ తిరకాసు.. అన్నింటినీ పక్కాగా పూర్తి చేసిన ఆ టీమ్‌.. అసలు విషయాన్ని మాత్రం సీల్డ్‌ కవర్‌లో దాచేసి వెళ్లిపోయింది. 

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న కె.లక్ష్మణ్ పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం కసరత్తు పూర్తయిందంట. కానీ, ఇప్పటి వరకూ ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది. తెలంగాణ విషయంలో బీజేపీ ఆశలు పెద్దవిగానే ఉన్నాయి.

అధికారంలోకి రావడమే లక్ష్యంగా చాలా సీరియస్‌గా ఆలోచిస్తోంది అధిష్టానం. రాష్ట్రంలో బలమైన టీఆర్ఎస్‌ను మరింత సమర్థంగా ఎలా ఢీకొట్టాలనే దానిపై పార్టీ పెద్దలు కసరత్తే చేస్తున్నారట. బలమైన నాయకత్వాన్ని నియమించి పార్టీని పటిష్టంగా మార్చాలని వ్యూహ రచన చేసిందట. 

ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న అధ్యక్ష పీఠాన్ని ఎవరికి అప్పగించాలనే విషయమై పార్టీ అధిష్టానం ఈ మధ్య ఇద్దరు సభ్యులతో కూడిన ఒక టీమ్‌ను సైతం పంపించి అభిప్రాయ సేకరణ చేసింది. పార్టీ జనరల్ సెక్రటరీ అనిల్ జైన్, ఉపాధ్యక్షుడు జయ పాండ వచ్చి రాష్ట్ర కోర్ కమిటీ, ఆఫీస్ బేరర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

దాదాపు 40 మంది నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి చేసిన కమిటీ… సీల్డ్ కవర్‌లో వివరాలను పార్టీ అధిష్టానానికి అప్పగించింది. పార్టీ అధ్యక్ష స్థానం కోసం పార్టీలో చాలా మంది పోటీ పడుతున్నారు. మరి ఎవరిని ఆ సీట్లో కూర్చోబెడతారోనన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. 

ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ తనకు మరోసారి అవకాశం కల్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్, పార్టీ సీనియర్లు చింతల రామచంద్రారెడ్డి, పేరాల శేఖర్‌రావు, ఎన్వీఎస్ ప్రభాకర్ కూడా ప్రయత్నాలు సాగించారు.

అంతేనా.. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి కూడా ట్రై చేసుకున్నారు. కానీ, వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న క్లూ మాత్రం ఎవరికీ దొరకడం లేదంటున్నారు. అధ్యక్ష కుర్చీ కోసం అనేక మంది పోటీ పడినప్పటికీ సీరియస్ పోటీ మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు మాజీ మంత్రి డీకే అరుణ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మధ్యనే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఈ విషయంపై ఒక ప్రకటన వచ్చేస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.