తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు ?

  • Published By: chvmurthy ,Published On : December 31, 2019 / 02:41 AM IST
తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు ?

తెలంగాణకు కొత్త సీఎస్‌ ఎవరు? ఇప్పుడిదే విషయం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడున్న సీఎస్ ఎస్‌కే జోషీ పదవీ కాలం నేటితో(31-12-2019) ముగుస్తోంది. దీంతో… ఆయన ప్లేస్‌లో ఎవరిని నియమించాలన్న విషయంపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఎవరి వైపు మొగ్గు చూపుతారా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. 
 

తెలంగాణ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి పదవీకాలం డిసెంబర్ 31తో ముగుస్తుంది. అయితే ఆయన స్థానంలో ఎవరొస్తారనే దానిపై తెలంగాణలో పెద్ద జోరుగా చర్చ జరుగుతోంది. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక మొదటి సీఎస్‌గా రాజీవ్ శర్మను నియమించారు. ఆ తర్వాత ప్రదీప్ చంద్రా.. ఎస్‌‍కే జోషీకి సీఎస్ పదవులు దక్కాయి. జోషి పదవీకాలం మంగళవారంతో ముగుస్తుంది. దీంతో… ఎవరిని సీఎస్‌గా నియమించాలా అనే విషయంపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 
 

తెలంగాణ సీఎస్ పదవి కోసం సుమారు 12మంది పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారందరి పేర్లనూ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే.. ఆ పన్నెండుమందిలో ముగ్గురు సీనియర్ అధికారులున్నారు. ప్రభుత్వ పథకాలను తీసుకురావడం.. అవి సమర్థవంతంగా అమలవడంలో ఈ ముగ్గురు అధికారులు కీలక పాత్ర పోషించారు. కొత్త సీఎస్‌ రేసులో అజయ్‌మిశ్రా, సోమేష్‌కుమార్‌, బినాయ్‌కుమార్, బీపీ ఆచార్య, చిత్ర రామచంద్రన్, పుష్ప సుబ్రహ్మణ్యం, ఆధర్ సిన్హా, సురేష్ చందా, హీరాలాల్ సమారియా, రాజేశ్వరి తిహారి, సునీల్ శర్మ ఉన్నారు. 
 

మరోవైపు.. 1984 బ్యాచ్‌కు చెందిన అజయ్‌మిశ్రా 2020 జూలైలో రిటైర్‌ కానున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన సోమేష్‌కుమార్‌ మరో మూడన్నరేళ్ల పాటు సర్వీసులో ఉండనున్నారు. 2023 డిసెంబర్ వరకు ఆయన సర్వీస్ ఉంటుంది. వీళ్లిద్దరితో పాటు… 1985 బ్యాచ్‌కు చెందిన చిత్ర రామచంద్రన్, 1988 బ్యాచ్‌కు చెందిన ఆధర్ సిన్హా పేర్లు సీఎం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే… ఈ పన్నెండుమందిలో… అజయ్‌ మిశ్రా, సోమేష్‌ కుమార్‌ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 
 

సీనియార్టీ పరంగా అజయ్‌మిశ్రాకే ఎక్కువ అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో ప్రభుత్వానికి ఎలాంటి వివాదాల్లేవు. దీంతో ఆయనవైపే సీఎం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అజయ్ మిశ్రాను ఇప్పుడు సీఎస్‌గా నియమించి.. ఆయన రిటైర్ అయ్యాక.. అంటే ఆరు నెలల తర్వాత.. సోమేష్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సెక్రటేరియట్‌లో చర్చ జరుగుతోంది. మరి సీఎం కేసీఆర్ మనసులో ఎవరున్నారు. కొత్త సీఎస్ ఎవరు… మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.

కాగా…ఎస్‌కే జోషి పదవీ విరమణ సందర్భంగా మంగళవారం డిసెంబర్ 31, సాయంత్రం 4 గంటలకు తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్‌ భవన్‌ 9వ అంతస్తులోని సమావేశ మందిరంలో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించనున్నారు. పలువురు ఐఏఎస్‌ అధికారులు ఈ కార్యక్రమంలో  పాల్గొననున్నారు.