అమ్మాయిల మోజుతో డేటింగ్ సైట్ లో రూ.41 లక్షల మోసపోయిన డాక్టర్

  • Published By: murthy ,Published On : October 10, 2020 / 02:23 PM IST
అమ్మాయిల మోజుతో డేటింగ్ సైట్ లో రూ.41 లక్షల మోసపోయిన డాక్టర్

women seeking men : కరోనా లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియా వెబ్ సైట్లనే బ్రౌజ్ చేసినట్లు లెక్కలు చెపుతున్నాయి. చాలా మంది ప్రజలు ఇంటికే పరిమితమై వాటిలో కాలక్షేపం చేశారు. సైబర్ నేరగాళ్లకు అదే వరప్రసాదం అయ్యింది. స్ధానిక వాణిజ్య ప్రకటనల కోసం రూపోందించిన లోకంటో.కామ్ సైట్ ఉపయోగించిన పలువురు ఇటీవల కాలంలో సైబర నేరాగాళ్ల చేతిలో మోసపోయారు.




హైదరాబాద్ పద్మారావు నగర్ కు చెందిన వ్యక్తి(57) వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుకుని డిగ్రీ పొందారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో వైద్యుడిగా ఎంపికై  ప్రస్తుతం గుజరాత్ లో విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చి ఇంటికే పరిమితమయ్యారు.

ఇంట్లో ఉన్నసమయంలో ఆయన లోకంటో సైట్ ను బ్రౌజ్ చేస్తుండగా అందులో వచ్చిన ఒక ప్రకటన పట్ల ఆకర్షితుడయ్యారు. ఇంటర్నెట్ లో సేకరించిన అందమైన యువతుల ఫోటోలతో రూపోందించిన….డేటింగ్ చేయటానికి యువతులు లభ్యం… అనే ప్రకటనతో ఆకర్షితుడైన డాక్టర్ ఆ ప్రకటనలో ఇచ్చిన నెంబర్లకు ఫోన్ చేశారు.




ఫోన్ రిసీవ్ చేసుకున్న అవతలి వ్యక్తి యాడ్ లో పోస్ట్ చేసిన యువతులు డేటింగ్ కు రెడీ గా ఉన్నారని నమ్మ బలికాడు. వారిని కలుసుకోవాలంటే తమ సంస్ధకి రిజిష్ట్రేషన్ ఫీజు చెల్లించాలని సైబర్ నేరగాళ్ళు షరతు పెట్టారు. అందుకోసం తమ బ్యాంకు ఖాతా వివరాలను డాక్టర్ కు అందచేశారు. డాక్టర్ వారు సూచించిన బ్యాంకు ఖాతాలో ఈ ఏడాది జూన్ 6న నగదు జమ చేశారు.

రిజిష్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత కధ వాట్సప్ లో యువతులతో చాటింగ్ లోకి మారింది. తాను కోరుకున్న యువతులే చాటింగ్ చేస్తున్నట్లు సీన్ క్రియేట్ చేశారు. తనను ప్రత్యక్షంగా కలుసుకోవాలంటే మరికొంత చెల్లించాలని ఆ యువతులు చాటింగ్ టైమ్ లో డాక్టర్ కు వివరించారు.




అందుకు సిధ్ధపడిన డాక్టర్ వారి పేటీయం, గూగుల్ పే వంటి ఈ-వాలెట్స్ కు డబ్బులు పంపటం మొదలెట్టాడు. ఈ రకంగా విడతలవారీగా డాక్టర్ వద్ద నుంచి నాలుగు నెలల్లో రూ.41.5లక్షలు వసూలు చేశారు.

ప్రతి పేమెంట్ లోనూ కొంత చార్జీలు పోనూ…మిగతాది రిఫండ్ వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. మళ్లీ రిఫండ్ వస్తుంది కదా అని నమ్మిన డాక్టర్ తనకు వచ్చే జీతంతో పాటు….దాచుకున్న డిపాజిట్లు విత్ డ్రా చేసి, అప్పులు చేసి మరీ వాళ్లకు చెల్లించారు. చివరికి ప్రావిడెంట్ ఫండ్ లోనూ కూడా పెట్టి గత నెలలోచెల్లింపులు చేశారు. కానీ తాను కోరుకున్నయువతితో ప్రత్యక్షంగా డేటింగ్ చేయలేకపోయారు.




నేరగాళ్లు ఇంకా డబ్బులు డిమాండ్ చేయటం మొదలెట్టేసరికి డాక్టర్ ఆలోచనలో పడ్డారు. ఈలోపు ఈసంగతి ఇంట్లో వాళ్లకు తెలిసి వాళ్లు డబ్బు చెల్లించకుండా జాగ్రత్త పడ్డారు. అక్టోబర్9, శుక్రవారం సీటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ ను కలిసి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాధమికంగా సైబర్ నేరగాళ్లు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.