హైదరాబాద్ సిటీ రోడ్లపై యతి జాడలు

  • Published By: vamsi ,Published On : May 3, 2019 / 04:36 AM IST
హైదరాబాద్ సిటీ రోడ్లపై యతి జాడలు

హైదరాబాద్ మహానగరంలో గుంతలు లేని రోడ్లు చూపించాలని ఛాలెంజ్‌లు విసురుతుంటారు నాయకులు. అయినా కూడా హైదరాబాద్‌లో రోడ్లు మీద కనిపించే గుంటలు మాత్రం పూడ్చుకోట్లేదు. ఇది ఇప్పడు ఉన్న పరిస్థితి కాదు ఎన్నో రోజులు నుంచి ఉన్న పరిస్థితే. ఇందుకు అధికారుల నిర్లక్షమో కాంట్రాక్టర్ల అవినీతి కారణమో ఎవరికి తెలియదు. సామాన్యుడుకి అర్థం కాదు.

ఈ గుంతలు పడిన రోడ్లు ప్రయాణీకులపాలిట నరకప్రాయంగా మారిన సంగతి తెలిసిందే. గతుకుల రోడ్లపై ప్రయాణంవల్ల రోజూ బ్రేక్‌డౌన్ అవుతున్న ఆర్‌టిసి బస్సులు, దెబ్బతింటున్న కార్లు, బోర్లా పడుతున్న బైక్‌లు, ట్రాఫిక్ జామ్‌లు ఒకటా రెండా రోడ్లపైన తిరగాలంటే పడే ఇబ్బందులు ఎన్నో. అయితే సమయం దొరికొనప్పుడు మాత్రం నెటిజన్లు రోడ్లపై గుంతల విషయంలో ప్రభుత్వాలకు చురకలు వేస్తూనే ఉంటారు.

ఈ క్రమంలో ఇటీవల భారత ఆర్మీ హిమాలయా పర్వతాల్లో యతి(మంచు మనిషి) జాడలు కనిపించాయంటూ ఫోటోలను పెట్టింది. అయితే అది నిజమా? కాదా? అసలు యతి ఉందా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో యతి జాడలు కనిపించాయంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.

హైదారాబాద్‌లోని రోడ్లపై గుంతల ఫోటోలను తీసి వాటిని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పెడుతున్న నెటిజన్లు.. అవి యతి జాడలు అంటూ చెబుతున్నారు. రోడ్ల దుస్తితిపై నెటిజన్లు ఈ విధంగా చురకలు అంటిస్తున్నారు. అందుకు సంబంధించిన రోడ్ల ఫోటోలను పెడుతుండడంతో నెట్టింట్లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.