రాణి మర్డర్ మిస్టరీ : తుకారాంగేట్ లో అదృశ్యం.. హుస్సేన్ సాగర్ లో లభ్యం

  • Published By: veegamteam ,Published On : December 14, 2019 / 07:25 AM IST
రాణి మర్డర్ మిస్టరీ : తుకారాంగేట్ లో అదృశ్యం.. హుస్సేన్ సాగర్ లో లభ్యం

ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఇంతకీ ఎవరా దోషులు? ఎవరు అసలు నిర్దోషులు? హైదరాబాద్ తుకారాంగేట్ పీఎస్ పరిధిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల ముందున్న సవాళ్లు ఇవి. దోషులను పట్టుకునేందుకు విచారణ బృందాన్ని రంగంలోకి దింపినా కేసు మిస్టరీ మాత్రం వీడడం లేదు. అసలు ఈ కేసును పోలీసులు ఛేదిస్తారా? లేక నీరుగారుస్తారా?

హైదరాబాద్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో హుస్సేన్ సాగర్ లో శవమై తేలింది. అయితే అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన యువతి మృతికి కొందరు వ్యక్తుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబసభ్యులు మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. 

తుకారాంగేట్ బుద్ధానగర్ కు చెందిన రాణి.. మారేడ్ పల్లిలోని ఓ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. నవంబర్ 21న కాలేజీకి వెళ్లిన రాణి ఇంటికి తిరిగి రాకపోవడంతో మరుసటి రోజు కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 23వ తేదీన హుస్సేన్ సాగర్ లో ఓ గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని చూసిన లేక్ పోలీసులు గాంధీ మార్చురీలో భద్రపరిచారు. అయితే యువతి మృతదేహాన్ని పోలీసులు రాణి కుటుంబసభ్యులకు చూపించారు. అప్పటికే మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో రాణి కుటుంబసభ్యులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతురాలు రాణిగా నిర్థారించారు.

తమ కుమార్తె మృతిపై పలు అనుమానాలున్నాయని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. రాణి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. తాము ఫిర్యాదు చేసిన రోజునే పోలీసులు స్పందించి ఉంటే తమ కూతురు దొరికేదని కంటతడి పెట్టారు. తుకారాంగేట్ పీఎస్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని మృతురాలి అక్క ఆరోపిస్తోంది. అలాగే మృతదేహం గుర్తించడంలో కూడా పోలీసులు వైఫల్యం చెందారని.. డీఎన్ఏ పరీక్షలు చేసిన తరువాతే తమ చెల్లెలి మృతదేహంగా గుర్తించామన్నారు. 

యువతి మిస్సింగ్ కేసు విచారణ సమయంలో అలసత్వం వహించిన సీఐను ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ సీసీఎస్ కు అటాచ్ చేస్తూ బదిలీ చేశారు. కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగిన రెండు బృందాలు.. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులకు సంబంధం ఉందన్న ఆరోపణల మేరకు విచారణ జరుపుతున్నారు. ఇంతకీ యువతి ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

* యువతి మర్డర్ మిస్టరీ
* నవంబర్ 21న అదృశ్యమైన రాణి
* 22న పోలీసులకు కుటుంబసభ్యుల ఫిర్యాదు
* 23న హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం
* డీఎన్ఏ పరీక్షల అనంతరం రాణి మృతదేహంగా నిర్థారణ