లోటస్ పాండ్‌లో షర్మిళ మీటింగ్.. కీలక వ్యక్తులకు అందిన ఇన్విటేషన్

లోటస్ పాండ్‌లో షర్మిళ మీటింగ్.. కీలక వ్యక్తులకు అందిన ఇన్విటేషన్

YS Sharmila: ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్న కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఈ మీటింగ్‌కు వైకాపా నేతలే కాకుండా.. వైఎస్సార్‌ అభిమానులు, సన్నిహితులకు ఈ సమావేశానికి ఇన్విటేషన్ వెళ్లినట్లు సమాచారం తెలుస్తోంది. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేసినపుడు ఆమె వెంట ఉన్న వారిలో ముఖ్యుల్ని కూడా పిలిచినట్లు సమాచారం. జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులుగా ఎంపిక చేసినట్లు తెలిసింది.

మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని షర్మిళ నివాసం లోటస్‌పాండ్‌లో ఈ మీటింగ్ జరుగుతుందని సూర్యాపేట జిల్లా వైకాపా అధ్యక్షుడు పిట్టా రామిరెడ్డి తెలిపారు. 11 గంటలకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారితో షర్మిల సమావేశమవుతారన్నారు. అనంతరం తెలంగాణలోని ఇతర జిల్లాల నేతలతో విడివిడిగా సమావేశమవుతారని వివరించారు. ఆ తర్వాత నుంచి ప్రతి 2 రోజులకు ఒక ఉమ్మడి జిల్లా సమావేశం జరుగుతుందని, అందరి సలహాలు, సూచనలు తీసుకొన్న తర్వాత కొన్ని పర్యటనలు కూడా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

దీనిపై వైఎస్ షర్మిల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. తెలంగాణలో కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ప్రధాన చర్చ ఉంటుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వైఎస్సార్‌కు సన్నిహితంగా ఉండే నేతల్లో ఎంపిక చేసుకొన్న కొందరితో మాట్లాడినట్లు సమాచారం. ఫిబ్రవరి 9న రాజశేఖర్‌రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా మంగళవారం తొలి సమావేశం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిసింది. కడప జిల్లా నుంచి కూడా కొందరు సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.