ZPTC, MPTC ఎన్నికలకు ఏర్పాట్లు : 22న నోటిఫికేషన్ !

  • Published By: madhu ,Published On : April 13, 2019 / 04:17 AM IST
ZPTC, MPTC ఎన్నికలకు ఏర్పాట్లు : 22న నోటిఫికేషన్ !

ZPTC, MPTC ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 22 నుండి మే 14 వరకు పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికనుగుణంగా ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సమావేశంలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వాహణపై చర్చించారు. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోందని సమాచారం. 

పరిషత్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల విధుల కోసం ఇప్పటికే ఆర్డర్లు అందుకున్న టీచర్లకు ఏప్రిల్ 15 నుండి 26వ తేదీల్లో ఏదో ఒక రోజు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల తయారీకి చేస్తున్న ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లతో సమీక్ష నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఏప్రిల్ 15న సీఎస్, డీజీపీలతో, ఏప్రిల్ 18న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీఈవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండగా ఆ లోగానే పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు అనుకుంటున్నారు.