కరోనా ఉన్నా లక్షణాలు లేకుంటే హోం ఐసోలేషన్, ప్రభుత్వం కీలక నిర్ణయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా రోగులు, వారికి ఇచ్చే ట్రీట్ మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్‌ ఉండి లక్షణాలు లేనివారిని హోం ఐసొలేషన్‌లో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. తక్కువ లక్షణాలు ఉన్నవారికి జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో, తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి మెడికల్‌ కాలేజీల్లో పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాజిటివ్‌ కేసులకు చికిత్స ఇస్తున్న నేపథ్యంలో హాస్పిటల్స్ సూపరింటెండెంట్లతో మంత్రి సోమవారం(జూలై 6,2020) కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న అవసరాలు, సమస్యలపై చర్చించారు.

వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, గాంధీ ఆసుపత్రి సూపింటెండెంట్ డాక్టర్ రాజారావు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి కొన్ని సూచనలు చేశారు.

కరోనా బాధితులకు అన్నం తినిపించడం పుణ్యకార్యం:
ఆసుపత్రుల్లో ఏ కొరత ఉండకుండా చూడాలని, వైద్యాధికారులు ఏ సౌకర్యాలు కోరినా ఒక్క రోజులో అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గాంధీలో బాధితులకు నర్సులు అన్నం తినిపిస్తున్నారని, అలాంటి మానవత్వం అందరిలోనూ ఉండాలని, అది గొప్ప పుణ్యకార్యమని, ఈ సేవతో పుణ్యం వస్తుందని చెప్పారు. మహబూబ్‌నగర్‌ సూపరింటెండెంట్‌ ఆసుపత్రి క్వార్టర్స్‌లోనే ఉండి పర్యవేక్షిస్తున్నందుకు ఆయన్ను అభినందించారు. జిల్లాల ఆసుపత్రుల సూపరింటెండెంట్లు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు.

రికార్డు స్థాయిలో 1831 కేసులు నమోదు:
తెలంగాణలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం(జూలై 6,2020) ఒక్కరోజులోనే రికార్డు సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మొత్తం 1831 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25వేల 733కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10,646. గత 24 గంటల్లో 2వేల 78 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14వేల 781కు చేరింది. ఇక సోమవారం మరో 11 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 306కి పెరిగింది.

 

ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,419 కేసులు:
సోమవారం నమోదైన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ భారీ ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 1,419 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 160 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 117 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో ఖమ్మం జిల్లా ఉంది. ఇక్కడ 21 కేసులు నమోదయ్యాయి.

READ  తెలంగాణ, ఆంధ్రా పై బండ వేసిన మర్కజ్ మసీద్

ఇక మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో 20 కేసుల చొప్పున గుర్తించారు. నల్గొండ, వరంగల్ అర్బన్, నిజామాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి జిల్లాల్లో 9 కేసుల చొప్పున గుర్తించారు. వికారాబాద్‌ లో 7, సూర్యాపేటలో 6, కరీంనగర్‌లో 5, జగిత్యాలలో 4, సంగారెడ్డిలో 3 కేసులు, గద్వాల, నారాయణ పేట, యాదాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 6వేల 383 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో 1,831 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య లక్ష 22వేల 218కు చేరింది.

Read Here>>హైదరాబాద్ కరోనా కేసులు పెరగడానికి కారణమిదే

Related Posts