‘బాజీరౌత్’ : మనకు తెలియని 12 ఏళ్ల స్వాతంత్ర్యసమరయోధుడు

  • Published By: nagamani ,Published On : August 14, 2020 / 10:31 AM IST
‘బాజీరౌత్’ : మనకు తెలియని 12 ఏళ్ల స్వాతంత్ర్యసమరయోధుడు

ఆగస్టు 15. ఈ రోజు భరతమాత దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా వాయులు పీల్చుకున్న శుభదినం. స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్దాలుగడిచినా ఆగస్టు 15 దేశ పండుగ వచ్చిందంటే ప్రతి భారతీయుడి మదిలో ఆనాటి స్వాతంత్ర్య సమరభేరి మ్రోగుతుంది. తెల్లవారిపై ఇప్పటికి భారతీయుల పిడికిళ్లు బిగుసుకుంటాయ్.

భరతమాత బానిస సంకెళ్లను తెంచుకుని స్వేచ్ఛా విహంగంలా ఎగిరిన అపూర్వ క్షణాలను గుర్తు చేసుకునే రోజు. ఎందరెందరి త్యాగఫలమో ఈ సుదినం. భరతమాతను తెల్లదొరల చెర నుంచి విడిపించడానికి వేలమంది త్యాగాలు చేశారు. తమ ప్రాణాలను పణ్ణంగా పెట్టి పోరాడారు…స్వాతంత్ర్యాన్ని సాధించారు.

స్వాతంత్ర్య వీరులు అనగానే గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి వారు యోధానుయోధులు చటుక్కున గుర్తుకొస్తారు. కానీ వెలుగులోకి రాని ఎంతోమంది పోరాట యోధులు చరిత్రలో కలిసిపోయారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వేలాది లక్షలాదిమంది పేర్లుకూడా తెలియవు. స్వాత్రంత్ర్య సంగ్రామంలో పెద్దలే కాదు పిల్లలూ కూడా పాల్గొన్నారు. తెల్లదొరల, వారి తొత్తులైన నల్లదొరల ధాష్టీకాలను సహించలేని బాలలు కూడా వందేమాతరం అంటూ జెండా పట్టి జైళ్ల కెళ్లారు. తెల్లోడి తూటాలకు నేలకొరిగారు. వారిలో చాలామందికి చరిత్రపుటల్లో చోటుదక్కలేదు. అటువంటి చిన్నారుల్లో 12 ఏళ్ల బాజీరౌత్ కూడా ఒకరు.

బాల్యంలోనే భారతమాత కోసం పోరాడి బ్రిటిష్ వారి కాల్పుల్లో నేలకొరిగాడు 12ఏళ్ల బాజీ రౌత్. భారత స్వాతంత్ర్య అమర వీరుల్లో అతి పిన్నవయస్కుడైన బాజీ 1926 అక్టోబర్ 5న ఒడిశాలోని డెంకనాల్ జిల్లాలో జన్మించాడు. తండ్రి పడవ నడిపేవాడు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని శంకర్ ప్రతాప్ సింగ్ దేవ్ అనే రాజు పాలించేవాడు. పన్నులు కట్టాలంటూ ప్రజలను హింసించేవాడు. పన్నుపోట్లతో ప్రజలపై ఉక్కుపాదం మోపేవాడు. బాలీ తల్లిని ఆ బాధితుల్లో ఒకరు.

బైష్ణవ్ చవాన్ పట్నాయక్ అనే యోధుడు, మార్క్సిస్టు ఆ ప్రాంతంలో రాజుపై తిరుగుబాటు లేవదీశాడు. ప్రజామండల్ పేరుతో ఉద్యమాన్ని లేవదీశాడు. దాంట్లో బాలలను కూడా చేర్చుకున్నాడు. ఈ ఉద్యమాన్ని అణచివేయటానికి శంకర్ ప్రతాప్ సింగ్ దేవ్ బ్రిటిష్ వారి సాయంతో యత్నించాడు. దీంతో తెల్లవారు డెంకనాల్‌లో నరమేధం సృష్టించారు. బైష్ణవ్ చవాన్ పట్నాయక్ తప్పించుకున్నాడు. అతన్ని వేటాడ్డానికి రాజు సైనికులు, తెల్ల సైనికులు పల్లెల్లో బీభత్సం సృష్టించారు. బ్రహ్మణి నది వద్ద పట్నాయక్ ఉన్నాడని తెలుసుకుని అక్కడి వెళ్లారు.

అది 1938 అక్టోబర్ 11. నీలకాంత్ ఘాట్ వద్ద 12 ఏళ్ల బాజీ తన మిత్రులతో కలసి కాపలాగా ఉన్నాడు. సైనిక మూకల కదలికలను ఉద్యమకారులకు చేరవేయడం అతని పని. సైనికులు బాజీ వద్దకు వచ్చారు. ఉద్యమకారులను పట్టుకుని కాల్చి చంపడానికి తమను పడవలో ఆవలి గట్టుకు తీసుకెళ్లాలని అతణ్ని ఆదేశించారు. బాజీ అందుకు ససేమిరా అన్నాడు. పడవను నడిపే ప్రసక్తే లేదన్నాడు. దీంతో ఆగ్రహించిన తెల్ల సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు.

అయినా బాజీ బెదరల్లేదు. తుపాకులు పేలాయి. బాజీతోపాటు మరో ఇద్దరు బాలురు అక్కడికక్కడే కన్నుమూశారు.. స్వాతంత్ర్యం కోసం పసిప్రాణాన్ని అర్పించిన బాలీ అత్యంత పిన్నవయస్కుడైన అమరవీరుడిగా బాజీరౌత్ నిల్చిపోయాడు.. ఇలాంటి మరెందరో వీరుల చరిత్రలు పాఠ్యపుస్తకాలకు ఎక్కాల్సిన అవసరముంది..నేటి తరాలకు ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది.