74th Independence Day 2020 : అంతర్జాతీయ వేదికపై జాతీయ జెండా ఎగరేసిన తొలి వనిత ‘భికాజి’

74th Independence Day 2020 : అంతర్జాతీయ వేదికపై జాతీయ జెండా ఎగరేసిన తొలి వనిత ‘భికాజి’

74వ ఇండిపెండెన్స్‌ డే కు భారత్ సిద్ధమైంది. రేపటి పంద్రాగస్టు వేడుకలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై తొలిసారి ‘భారత స్వాతంత్య్ర పతాకా’న్ని ఎగురవేసి చరిత్ర సృష్టించిన “భికాజి రుస్తుం కామా”ను గుర్తు చేసుకుందాం. సాధారణంగా భికాజీని చాలా తక్కువగా గుర్తు చేసుకుంటారు. కాని ఆ యోధురాలి స్మృతి మరల మరల దుమ్ము తెరలను తొలగించుకుని నవతరాలకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది

మేడమ్‌ కామా’గా నాటి యోధులు ఆమెను పిలిచేవారు. బ్రిటిష్‌ వారు ‘డేంజరస్‌ అనార్కిస్ట్‌’, ‘నొటోరియస్‌ పార్శీ లేడీ’ అని రుసరుసలాడేవారు. ఆమె వారిని అలా గడగడలాడించింది. దేశం కోసం ఆమె భర్తతోనే విభేదించింది. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా లండన్‌లో ఉండే పోరాడింది. అంతర్జాతీయ వేదికపై తొలిసారి ‘భారత స్వాతంత్య్ర పతాకాన్ని ఎగురవేసింది. దేశానికి స్వాతంత్య్రం వస్తే స్త్రీకి కూడా వస్తుంది అని గట్టిగా విశ్వసించింది

1907 ఆగస్టు 21న జర్మనీ వేదిక మీద పతాకాన్ని పట్టుకుని, భారతీయ కట్టుబొట్టుతో, ఉద్వేగంతో మాట్లాడుతున్న ఆ ధీరోదాత్తను ఆ సమావేశంలో ఉన్న సుమారు వేయిమంది క్రాంతికారులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ‘చూడండి… భారత స్వాతంత్య్ర పతాక ఆవిర్భావం జరిగింది. దేశం కోసం ప్రాణాలర్పించిన యువ యోధుల రుధిరంతో ఇది పవిత్రమై ఉంది. స్వేచ్ఛను గౌరవించే ప్రపంచవ్యాప్త పౌరులందరూ మా దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని సమర్థించాలని ఈ పతాకం సాక్షిగా నేను కోరుతున్నాను’అని ఆమె మాట్లాడిన మాటలు ఎప్పటికి మర్చిపోలేనివి. ఆ సమయంలో ‘జెంటిల్మన్‌… కమాన్‌… స్టాండప్‌ అండ్‌ సెల్యూట్‌’. అని ఆమె అనగానే అందరూ అప్రయత్నంగా లేచి ఆమె చేతిలో ఉన్న తొలి రూప స్వాతంత్య్ర పతాకానికి సెల్యూట్‌ చేశారు.

1861లో సంపన్న పార్శీ కుటుంబంలో భికాజి కామా పుట్టింది. తండ్రి పెద్ద లాయర్‌. వ్యాపారవేత్త. కాని భికాజి బాల్యం నుంచే పేదవారి పట్ల ఈ దేశపు సామాన్య ప్రజల పట్ల సానుభూతితో ఉండేది. ఆమె మంచి వక్త. దేశాన్ని, ప్రపంచాన్ని చుట్టి రావాలంటే నాలుగు భాషలు వచ్చి ఉండాలని ఆ రోజుల్లేనే గ్రహించి వీలైనన్ని భాషలు నేర్చుకుంది. 24 ఏళ్ల వయసులో ఆమెకు మరో సంపన్న లాయర్‌ అయిన రుస్తుం కామాతో వివాహం జరిగింది. ఆమె తలుచుకుంటే ఆ సంపన్న జీవితంతో కోరిన పదవులు పొంది ఉండేది. ఎందుకంటే భర్త బ్రిటిష్‌వారికి సన్నిహితుడు. కాని ఆమె భర్త ధోరణిని అంగీకరించలేదు. బ్రిటిష్‌ వారిని ఈ దేశం నుంచి వెళ్లగొట్టాలనేది ఆమె ప్రగాఢ వాంఛ. భర్తతో విడాకులకు ఈ ఆలోచనే కారణం.

ప్లేగు వ్యాధితో జీవితం మలుపు
1886లో దేశాన్ని ప్లేగు ముంచెత్తింది. ఒక్క ముంబైలోనే 22 వేల మంది మరణించారు. భికాజి కామా తనే ఒక కార్యకర్తగా మారి ప్లేగు బాధితుల వైద్యం కోసం, సహాయం కోసం విస్తృతంగా పని చేసింది. ఆ పనిలో ఆమె కూడా ప్లేగు బారిన పడింది. అయితే దాని నుంచి కోలుకున్నా పూర్తి స్వస్థత పొందలేదు. విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటే ఫలితం ఉంటుందని వైద్యులు సలహా ఇవ్వడంతో 1902లో లండన్‌ వెళ్లింది. ఆ ప్రయాణమే జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ తర్వాత దాదాపు 35 ఏళ్ల కాలం విదేశీ నేల మీద ఉంటూనే దేశ స్వాతంత్య్ర కోసం పోరాడాల్సి వచ్చింది.

లండన్‌ నాయకురాలు
భికాజి కామా లండన్‌కు చేరుకున్నాక అప్పటికే అక్కడ స్వాతంత్య్ర పోరాటంలో నిమగ్నమై ఉన్న దాదాభాయ్‌ నౌరోజి, లాలా హర్‌దయాళ్, శ్యాంజీ కృష్ణవర్మ వంటి ప్రముఖులతో చేతులు కలిపింది. లండన్‌ హైడ్‌ పార్క్‌లో భారతదేశంలో బ్రిటిష్‌ వారి పాలన ఎంత దాష్టికమైనదో ఆమె ఉపన్యాసాలు ఇస్తూంటే గొప్ప ఉద్వేగం కలిగేది. లండన్‌కు చదువుకోవడానికి వచ్చిన వీర్‌ సావర్కార్‌ వంటి విద్యార్థులు ఆమెను తమ మార్గదర్శిగా చూసేవారు. అంతేకాదు ఆమె దేశభక్తిని ప్రేరేపించే నిషిద్ధ పత్రికలు నడిపి పాండిచ్చేరి మీదుగా దేశంలోకి స్మగుల్‌ చేసేది. ఇవన్నీ భారత దేశంలో ఉన్న బ్రిటిష్‌ వారికి తెలిశాయి. ‘నువ్వు దేశంలోకి తిరిగి రావాలంటే బ్రిటిష్‌ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించనని హామీ ఇవ్వాలి’ అని కోరారు. మేడమ్‌ కామా అందుకు నిరాకరించింది. జర్మనీలో తొలిసారి దేశపతాకం ఎగుర వేశాక భారతదేశ ద్వారాలు ఆమెకు శాశ్వతంగా మూతపడ్డాయి.

భారత స్వాతంత్య్ర పతాక రూపకల్పన
1905 నుంచి భారత స్వాతంత్య్ర పతాక రూపకల్పనకు ప్రయత్నాలు మొదలయ్యాయి. వివిధ బృందాలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి. భికాజి కామా, శ్యాంజీ కృష్ణవర్మ మరికొందరు కలిసి ఒక పతాకాన్ని తయారు చేశారు. దీనికి అంతకుముందే తయారైన కలకత్తా పతాకం స్ఫూర్తి. ఈ పతాకంలో కూడా మూడు రంగులు ఉన్నాయి. ఆకుపచ్చ ఇస్లాంకు, పసుపు హిందూ ధర్మానికి, ఎరుపు బుద్ధిజానికి ప్రతీకలు. తొమ్మిది కమలాలు తొమ్మిది భౌగోళిక ప్రాంతాలకు ప్రతినిధులు. పతాకం మధ్యలో ‘వందే మాతరం’ అని ఉంటుంది. పతాకంలో ఇస్లాం సంకేతం నెలవంక, హిందూ సంకేతం సూర్యుడు ఉంటాయి. ఈ పతాకాన్ని భికాజీ జర్మనీలో తొలిసారి ఎగురు వేసి ప్రపంచానికి భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటాన్ని తెలియపరిచింది. ఇది జరిగాక ఆమె బ్రిటిష్‌ వారికి ప్రధాన శతృవుగా మారింది. ఆమెను బంధించి అండమాన్‌కు పంపాలని అనుకున్నారు.

‘పారిస్‌ ఇండియన్‌ సొసైటీ’ ప్రారంభం

భికాజి కార్యకలాపాలను బ్రిటిష్‌వారు సహించలేకపోయారు. దాంతో ఆమె లండన్‌ నుంచి పారిస్‌ చేరుకుంది. అక్కడ ‘పారిస్‌ ఇండియన్‌ సొసైటీ’ని ప్రారంభించింది. ఫ్రెంచ్‌ సోషలిస్ట్‌ పార్టీ సభ్యురాలైంది. ఆమెకు లెనిన్‌తో, గోర్కితో స్నేహం ఉండేది. లెనిన్‌ ఆమెను రష్యా వచ్చేయన్నాడని అంటారు. కాని ఆమె పారిస్‌లోనే ఉంటూ దేశ విదేశాల్లో భారత స్వాతంత్య్ర సంగ్రామానికి మద్దతు కూడగట్టింది. ‘రక్తపాత రహిత పోరాటం మా లక్ష్యం. కుదరకపోతే రక్తం పారించైనా స్వాతంత్య్రం పొందుతాం’ అని అమెరికాలో ఆమె చేసిన ప్రసంగం ప్రసిద్ధం. కైరోలో ఒక సభలో ‘ఇక్కడంతా ఈజిప్టు పుత్రులే ఉన్నారు. పుత్రికలు ఎక్కడ. స్త్రీలు లేకుండా ఏ ప్రగతైనా ఎలా సాధ్యం’ అని ప్రశ్నించింది.

భికాజి మరణం
మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌ జట్టు కట్టాయి. అంతవరకూ భికాజీని కాపాడుకుంటూ వచ్చిన ఫ్రాన్స్‌ ఇప్పుడు ఇంగ్లాండ్‌ను సంతృప్తి పరచడానికి ఆమె పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. భికాజి పారిస్‌ వదిలి రెండు మూడు చోట్ల తల దాచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు పక్షవాతం వచ్చింది. భారతదేశాన్ని చూడాలని, ఆ నేల మీదే మరణించాలని ప్రగాఢంగా కోరుకుంది. 1935 నవంబర్‌లో 74 ఏళ్ల వయసులో అనారోగ్యంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత 9 నెలలకు ఆగస్టు 13న 1936లో మరణించింది. ఆమె యావదాస్తి ప్రజాహిత కార్యకలాపాల కోసం దానం చేసేసింది.