ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తోంది…దేశ రక్షణలో రాజీలేదు : రాజ్‌నాథ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్‌-చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ప్రకటన చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించిందని వివరించారు.

మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్‌ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. సరిహద్దుల్లో సైన్యాలను మరింత పెంచామని అన్నారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను సమకూర్చామని అన్నారు.

సరిహద్దులను మార్చాలని చూసిన చైనా దుశ్చర్యలను భారత్ సైన్యం తిప్పికొట్టిందన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని, దేశ సౌర్వభౌమత్వ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ఆగస్టు 29,30న చైనా సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత జవాన్లు తిప్పికొట్టారన్నారు. 1993,96 ఒప్పందాలను చైనా ఉల్లంఘించిందని మండిపడ్డారు.

లడఖ్‌ లో 1962లో 90వేల చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని తెలిపారు. ఎల్ఏసీ విషయంలో ఇరు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయని ఉన్నాయన్నారు. అయితే, సరిహద్దు సమస్య తేలేవరకూ ఎల్ఏసీ గౌరవించాలన్న నిర్ణయాన్ని చైనా ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు

చైనా ఏకపక్ష చర్యలను భారత్‌ ఖండిస్తోందని, డ్రాగన్‌ కదలికలను పసిగడుతున్నామని మన సైన్యం కూడా అప్రమత్తంగా ఉందని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.  చైనా దూకుడు చర్యలతో శాంతి ఒప్పందంపై తీవ్ర ప్రభావం కలుగుతోందని ఆరోపించారు.

సామరస్య చర్చలతో సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. భారత్‌ శాంతినే కోరుకుంటోందని, సామరస్య చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. చైనా రక్షణ మంత్రితో తాను చర్చలు జరిపానని, యథాతథ స్థితికి భంగం కలిగించే చర్యలు చేపట్టవద్దని ఆయనతో స్పష్టం చేశానని తెలిపారు.

Related Posts