భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది, 2021లోనూ కొనసాగుతుంది, AIIMS చీఫ్ కీలక వ్యాఖ్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇప్పటికే కరోనా దెబ్బకు యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా వణుకుతోంది. రోజురోజుకి దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బాధితుల సంఖ్య 40లక్షల మార్క్ దాటింది. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 70వేలకు చేరువలో ఉంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా, కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమిటంటే, భారత్ లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందట. అంతేకాదు 2021లోనూ కరోనా మహమ్మారి కొనసాగనుందట.

కరోనా సెకండ్ వేవ్ మొదలైంది:
కరోనా సెకండ్ వేవ్ గురించి ఢిల్లీ ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS) డాక్టర్ రణ్ దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని ఆయన తెలిపారు. అంతేకాదు కరోనా మహమ్మారి వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్-19 స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో గులేరియా కీలక సభ్యుడిగా ఉన్నారు. వైరస్ ప్రభావం రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. మహమ్మారి 2021లో ముగుస్తుందని చెప్పలేమన్న ఆయన.. వచ్చే ఏడాది వైరస్ ప్రభావ తీవ్రత తక్కువగా ఉండొచ్చని చెప్పారు.

చాలా లైట్ తీసుకుంటున్నారు:
‘కరోనా వ్యాప్తి చిన్న నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు పాకింది. అందుకే పాజిటివ్ కేసులు ఇంతగా పెరుగుతున్నాయి. జనాభాను బట్టి చూస్తే మరికొన్ని నెలలు కేసుల పెరుగుదలను ఊహించొచ్చు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ తిరగబెడుతుండటం చూస్తున్నాం. ఇది ఒక రకంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైందని చెప్పొచ్చు. దీనికి చాలా కారణాలున్నాయి. కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో చాలా జాగ్రత్తలతో వ్యవహరించిన వారు సైతం… ఇప్పుడు కాస్త లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. కేసులు తిరగబెట్టడానికి ఇదో ముఖ్య కారణం.

కరోనా కేసులు పెరగడానికి కారణాలు ఇవే:
టెస్టింగ్ కెపాసిటీ పెరగడంతో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీంతో లక్షణాలు తక్కువ దశలో ఉన్నప్పుడే పాజిటివ్ అని బయట పడుతుండటంతో జాగ్రత్తలు తీసుకుంటూ, వైరస్ బారి నుంచి కోలుకోవడం సులువవుతోంది. అయితే కరోనా సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో చాలా చోట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో ప్రజలు మాస్కులు కట్టుకోవడం లేదు. గుంపులుగా గుమిగూడుతున్నారు. ట్రాఫిక్ జామ్స్ కూడా పెరిగిపోయాయి. ఒక రకంగా ప్రీ-కరోనా రోజులు వచ్చేశాయి. కరోనా కేసుల పెరుగుదలకు ఇదీ ఒక కారణమే’ అని గులేరియా అన్నారు.

3 నుంచి 6 నెలల వరకు రెండోసారి కరోనా బారిన పడే అవకాశం లేదు:
ప్రపంచంలో చాలా చోట్ల రీఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయని… అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అదేమీ ఆందోళన పెట్టే అంశం కాదన్నారు. ఒక్కసారి కోవిడ్ 19 పేషెంట్‌లో యాంటీబాడీస్ అభివృద్ది చెందితే… 3 నుంచి 6 నెలల వరకూ తిరిగి అతను కరోనా బారినపడకుండా ఉండే అవకాశం ఉన్నట్లు డేటా చెబుతోందన్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరికి కరోనా వ్యాక్సిన్ భారత్‌లో అందుబాటులోకి రావచ్చన్నారు. ప్రస్తుతం భారత్‌లో మూడు వ్యాక్సిన్లు అడ్వాన్స్ స్టేజ్ డెవలప్‌మెంట్‌లో ఉన్నాయన్నారు. అయితే ఏ వ్యాక్సిన్ అయినా… అది ఎంత సేఫ్ అన్నదే ముఖ్యమని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చేసిందని చెప్పడానికి ముందు… పెద్ద ఎత్తున ట్రయల్స్ జరపాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా లెక్కల్లో తన వరల్డ్ రికార్డ్ తానే బ్రేక్ చేసిన భారత్:
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా లెక్కల్లో భారత్ తన ప్రపంచ రికార్డును తానే బ్రేక్ చేసింది. కరోనా రోజువారి కేసుల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలో రికార్డ్ అయ్యాయి. ఒక్కరోజే 86వేల 432 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40లక్షల 23వేల 179 కు చేరింది. ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదవడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఇక గత 24 గంటల్లో 1,089 కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 69వేల 561 కు చేరింది. కరోనా బారినపడ్డవారిలో కొత్తగా 70 వేల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 31లక్షల 07వేల 223. ప్రస్తుతం 8లక్షల 46వేల 395 యాక్టివ్‌ కేసులున్నాయి.

నేడో రేపో రెండో స్థానానికి భారత్:
63లక్షల 89వేల 057 కరోనా కేసులతో అమెరికా.. 40లక్షల 91వేల 801 కేసులతో బ్రెజిల్‌ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 40లక్షల 23వేల 179 కేసులతో భారత్‌ మూడో స్థానంలో ఉంది. కేసులు నమోదవుతున్న తీరును బట్టి చూస్తే నేడో రేపో భారత్‌ బ్రెజిల్‌ను దాటేసి రెండో స్థానానికి చేరుకోవడం ఖాయం.

Related Posts