డీఎస్పీగా బాధ్యతలు అందుకున్న హిమదాస్

డీఎస్పీగా బాధ్యతలు అందుకున్న హిమదాస్

Athlete Hima Das: కొద్ది రోజుల ముందు ప్రకటించిన బాధ్యతను స్టార్ స్పింటర్ హిమ దాస్ కు అందజేసింది అస్సాం ప్రభుత్వం. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ లెటర్ అందుకున్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీగా బాధ్యతలు అందుకుని తాను చిన్నతనంలో పోలీసు అధికారి కావాలని కలలు కనేదానిని అని వెల్లడించారు. ఆ కోరికతోనే చిన్నప్పుడు దుర్గా పూజ సమయంలో బొమ్మ తుపాకీ పట్టుకుని తిరిగేదానినంటూ గుర్తు చేసుకున్నారు.

ఆట తన జీవితంలో అన్నీ తీసుకొచ్చిందని చెప్పారు. అసోంలో నేరాల నియంత్రణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ 20 ఏళ్ల అస్సామీ స్పింటర్‌ IAAF వరల్డ్‌ అండర్‌-20 ఛాంపియన్‌ షిప్స్‌లో గ్లోబల్‌ ట్రాక్‌ ఈవెంట్‌ ఫార్మాట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా రికార్డు సాధించారు.

హిమదాస్‌ అసోం లోని నాగయోన్‌ జిల్లాలో ఢింగ్‌ గ్రామానికి చెందిన రైతు కుటుంబమైన రంజిత్ దాస్, జొనాలి దాస్‌ల సంతానం. వారి నలుగురు పిల్లలలో హిమదాస్ చివరిది. స్థానికంగా వరి పండించే రైతు తండ్రి ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ కనబరిచారు.