కరోనా తొలి టీకా 11 నుంచే.. టైం స్లాట్ ప్రకారమే రావాలి

కరోనా తొలి టీకా 11 నుంచే.. టైం స్లాట్ ప్రకారమే రావాలి

Corona Vaccine: నెలల తరబడి పడ్డ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడే సమయం వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో అంతా శుభమే అంటున్నారు నిపుణులు. దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేసేందుకు కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ మేర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంకేతాలు ఇచ్చింది. జనవరి 11న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని కీలకాధికారి సోమవారం తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కరోనా టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు.

వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఎటువంటి స్పష్టత రాలేదని పేర్కొన్నారు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్‌ టీకా, భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ టీకాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లను వేగవంతం చేసేందుకు సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా వైద్యాధికారులకు హైదరాబాద్‌లో రెండ్రోజుల ట్రైనింగ్‌ను ప్రారంభించింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు.

ముందుగా 10 లక్షల డోసులు:
ముందుగా రాష్ట్రానికి 10 లక్షల డోసేజ్ కరోనా వ్యాక్సిన్లు రానున్నాయి. మొదటి విడతలో వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వేసేందుకు కోవీషీల్డ్‌ వ్యాక్సిన్ రాష్ట్రానికి రానున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రానికి ముందుగా 2 లక్షల 88వేల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని గాంధీ ఆసుపత్రి వరకు అన్నిచోట్లా వైద్య సిబ్బందికి టీకాలు వేస్తారు.

రోజుకు ఎంతమందంటే:
మొదటి రోజు ప్రతి కేంద్రంలో 50 మందికి చొప్పున మాత్రమే వ్యాక్సిన్ వేస్తారు. ఆ తర్వాత ప్రతీ కేంద్రంలో 100 మందికి వేస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా కార్యక్రమం ఉంటుంది. వైద్య సిబ్బంది మొత్తానికి టీకా వేయడానికి 2 వారాల సమయం పడుతుంది. ఆ తర్వాత రెండో డోసును 28 రోజుల తర్వాత వేస్తారు.

టీకా ఎవరెవరికి ఏ సమయానికి వేస్తారో ప్రతీ ఒక్కరికీ టైం స్లాట్‌ కేటాయిస్తారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో సమయం కేటాయించి వారి మొబైల్‌ ఫోన్లకు టైం స్లాట్‌ మెసేజ్‌లు పంపిస్తారు. ముందుగా వేచి ఉండే గది, తర్వాత టీకా గది, టీకా తీసుకున్నాక సైడ్‌ ఎఫెక్ట్స్‌ను పరిశీలించేందుకు అరగంట వేచి ఉండేలా మరో గది ఉంటాయి.

వారంలో నాలుగు రోజులే
కరోనా వ్యాక్సిన్‌ వారానికి 4 రోజులు మాత్రమే వేస్తారు. బుధ, శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్‌ ఉండదని అధికారులు వెల్లడించారు. టీకాను లిస్టు ప్రకారం, ఇచ్చిన టైం స్లాట్‌ ప్రకారమే ఇస్తారు. టీకా లబ్దిదారులు గుర్తింపు కార్డు తీసుకొని కేంద్రానికి రావాల్సి ఉంటుంది. దాన్ని సరిచూసుకున్నతర్వాతే టీకా వేస్తారు. ఒకవేళ ఎవరైనా వారికి కేటాయించిన రోజు రాకపోతే అటువంటి వారికి ప్రత్యేకంగా మరో రోజు కేటాయిస్తారు. టీకా వేసుకోవాలా వద్దా అనేది స్వచ్ఛందమేనని అధికారులు వెల్లడించారు.

గురు, శుక్రవారాల్లో భారీ డ్రైరన్‌
వ్యాక్సినేషన్‌ ఎలా వేయాలో ట్రయల్స్‌ కోసం ఇప్పటికే రాష్ట్రంలో 2 జిల్లాల్లో 6 చోట్ల డ్రైరన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌లో 3కేంద్రాలు, మహబూబ్‌నగర్‌లోనూ 3 కేంద్రాల్లో డ్రైరన్‌ నిర్వహించారు. ఈ 6 చోట్ల డ్రైరన్‌ నిర్వహించగానే సరిపోదని, మిగిలిన ప్రాంతాల్లోని సిబ్బందిలో కొంత గందరగోళంఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ భావించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోయినా వచ్చే గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో 1,200 కేంద్రాల్లో డ్రైరన్‌ నిర్వహించాలని నిర్ణయించింది. వ్యాక్సినేషన్ మొదలుపెట్టాక ప్రక్రియ సాఫీగా సాగాలనే ఈఏర్పాట్లు చేస్తున్నారు.