బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం ఆర్బీఐతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది

బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం ఆర్బీఐతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది

Bank Privatisation: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి పనిచేసి బ్యాంకుల ప్రైవేటీకరణ అంశాన్ని సిద్ధం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు సిద్ధమవుతున్నాయని, త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు ముంబైలో మీడియాతో మాట్లాడారు. రెండు బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని ఇదివరకే బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

బ్యాంకులను అప్పగించే వ్యక్తుల వివరాలు తెలియజేసేందుకు నిరాకరించారు. నేషనల్‌ అస్సెట్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పేరిట ఏర్పాటు కాబోయే బ్యాంక్‌ గురించి నిర్మలా సీతారామన్‌ వివరించారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తుల బదిలీకి ఏర్పాటు చేయబోయే నేషనల్‌ ఏఆర్‌సీకి ప్రభుత్వం తరఫున కొంతమేర హామీ ఉంటుందని చెప్పారు. బ్యాంకుల పనితీరు మెరుగుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రా సెస్‌ నుంచి కేంద్రానికి రూ.30వేల కోట్లు సమకూరే అవకాశం ఉందని తెలిపారు. దేశంలో పెట్రోల్‌ ధరలు భగ్గుమంటున్నవేళ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తే.. ఆ మేరకు రాష్ట్రాలు పన్నులు పెంచుకుని, ఆదాయాన్ని సంపాదించుకుంటాయని తెలిపారు. కేంద్రం తగ్గించడం వల్ల రేట్లలో చెప్పుకోదగ్గ మార్పు ఉండబోదని వ్యాఖ్యానించారు.