అశ్విన్ మరో రికార్డు.. టీమిండియా మొత్తం సంతోషాల వెల్లువ

అశ్విన్ మరో రికార్డు.. టీమిండియా మొత్తం సంతోషాల వెల్లువ

Ravichandran Ashwin: చెన్నై వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత నమోదు చేశాడు. బౌలింగ్ లో అద్భుతాలు సృష్టిస్తున్న అశ్విన్.. బ్యాటింగ్ లోనూ మెరుపులు కురిపించాడు. రెండో ఇన్నింగ్స్ లో క్రీజులో పాతుకుపోయిన స్పిన్నర్.. 135 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో సెంచరీ పూర్తి బాదేశాడు. అలా ఐదో టెస్టు సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మూడో రోజు ఆటలో భాగంగా సోమవారం కోహ్లితో కలిసి 96 పరుగుల విలువైన పార్టనర్‌షిప్ నెలకొల్పిన అశ్విన్.. జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. ఆ తర్వాత వికెట్లు పడుతున్నప్పటికీ.. క్రీజులో పాతుకుపోయాడు. అలా వీరోచిత సెంచరీ సాధించాడు. ముందుగా ఆడుతూపాడుతూ.. హాఫ్ సెంచరీ చేసి ఆ తర్వాత సెంచరీ వైపు వెళ్తాడా అనే అనుమానం కనిపించింది.

పదకొండో బ్యాట్స్‌మన్‌గా క్రీజ్‌లోకి వచ్చిన సిరాజ్‌ను మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. సిరాజ్ వికెట్ కాపాడుకుంటూనే స్కోరు బోర్డును నడిపించాడు. మొయిన్‌ అలీ వేసిన ఇన్నింగ్స్‌ 82వ ఓవర్‌ ఐదో బంతికి ఫోర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్‌పై అశ్విన్‌ చేసిన తొలి టెస్టు సెంచరీ కాగా, అంతకుముందు వెస్టిండీస్‌పైన నాలుగు సెంచరీలు నమోదు చేశాడు.

ఈ ఫీట్ సాధించిన అశ్విన్‌ అరుదైన జాబితాలో చేరిపోయాడు. టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లను, సెంచరీని అత్యధికంగా సాధించిన ప్లేయర్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో 5 వికెట్లను, సెంచరీని నమోదు చేసిన ప్లేయర్లలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్‌ బోధమ్‌ ముందున్నాడు.

అశ్విన్ ఆ లిస్టులో రెండో తమిళనాడు ప్లేయర్ కాగా, క్రిస్ శ్రీకాంత్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 123పరుగులు చేసి ముందు నిలిచాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగి.. సెంచరీ చేసిన రెండో ప్లేయర్ కూడా అశ్విన్ నే. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఈ లిస్టులో తొలి క్రికెటర్. 1987లో జరిగిన మ్యాచ్ లో 135పరుగులు చేసి అతను ఇదే రికార్డు నమోదు చేశాడు.