రోజులు మారాయా: స్టేడియంలోకి ప్రేక్షకులకు ఎంట్రీ

రోజులు మారాయా: స్టేడియంలోకి ప్రేక్షకులకు ఎంట్రీ

India vs England: కరోనా చేసిన కనికట్టుకు క్రికెట్ వైభవం సగం తగ్గినట్లు అయింది. ఐపీఎల్ మ్యాచ్‌లు స్టేడియాలలో ప్రేక్షకులు లేకుండానే కేవలం టీవీలలో చూసే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో మరోసారి ఆలోచించాలనుకుంది బీసీసీఐ. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే ద్వైపాక్షిక టీ20 సిరీస్ కోసం ప్రేక్షకులకు గేట్లు ఓపెన్ చేయాలనుకుంటున్నారు.

సెంట్రల్ గవర్నమెంట్‌తో చర్చలు జరుపుతున్నారు. ‘ప్రేక్షకులను స్టేడియంలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం. టీ20 సిరీస్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వీలు కల్పించాలనుకుంటున్నాం. ఎంత మందిని అనుమతించాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 50 శాతం సీట్లను ప్రేక్షకులతో నింపాలనే ఆలోచన ఉంది. గవర్నమెంట్ అప్రూవల్ తర్వాతే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. అందరి ఆరోగ్యం, భద్రతే ప్రధానమైంది. సురక్షితంగా నిర్వహించడమే ముఖ్యం’ అని బోర్డు అధికారి వెల్లడించారు.

కొవిడ్‌-19 వ్యాప్తి జరిగేలా ఎటువంటి చర్యలు తీసుకోకూడదని బోర్డు భావిస్తోందని.. క్రికెటర్లు క్వారంటైన్, కరోనా పరీక్షలు నిర్వహించాకే బయో బబుల్‌లోకి వెళ్తారన్నారు. ఇప్పటి వరకైతే టెస్టు సిరీస్‌ను గేట్లు మూసే నిర్వహించనున్నారు. టికెట్లు జారీ చేయరాదని తమిళనాడు క్రికెట్‌ సంఘం అధికార వర్గాలకు సమాచారమిచ్చింది.

నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులు ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు, ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు చెన్నైలో జరగనున్నాయి. అనంతరం మూడో టెస్టు ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు, నాలుగో టెస్టు మార్చి 4 నుంచి 8 వరకు అహ్మదాబాద్‌లో నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లో పునర్‌నిర్మించిన సర్దార్‌ పటేల్‌ మొతెరా స్టేడియాల్లో మార్చి 12 నుంచి ఐదు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్‌ మొదలుకానుంది. అందులోకి అనుమతిస్తే లక్షా 10 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్‌ను తిలకించవచ్చు. కనీసం 50 శాతం అనుమతించినా 55 వేల మందికి ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరికినట్లే.