‘గూగుల్ 85శాతం యాడ్ రెవెన్యూ మాకు ఇవ్వాలి’

‘గూగుల్ 85శాతం యాడ్ రెవెన్యూ మాకు ఇవ్వాలి’

Google-ads

Google Ad Revenue: గూగుల్ మాకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుంది ఇండియన్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్. ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త చ‌ట్టంతో స్ఫూర్తితో డిమాండ్ కు తెరదీసింది. త‌మ కంటెంట్‌ను వాడుకుంటున్న గూగుల్ యాడ్ రెవెన్యూలో 85 శాతం ఇవ్వాల‌ని ఇండియ‌న్ న్యూస్‌పేప‌ర్స్ సొసైటీ (ఐఎన్ఎస్‌) డిమాండ్ చేస్తోంది.

ఈ సొసైటీలో దేశ వ్యాప్తంగా ఉన్న వెయ్యి ప‌త్రిక‌లు నమోదై ఉన్నాయి. వేలాది మంది జ‌ర్న‌లిస్టుల‌కు జీతాలు చెల్లిస్తూ సేకరిస్తున్న వార్త‌ల‌ను గూగుల్ వాడేసుకుంటుంది. అందుకుగానూ.. తమకు ప‌రిహారం ఇవ్వాల‌ని సొసైటీ క్లియర్ గా చెప్పేసింది. కొద్ది రోజుల ముందే న్యూస్ వాడుకుంటున్నందుకు డ‌బ్బులు చెల్లించాల‌ంటూ ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టం తీసుకొచ్చింది.

ఆస్ట్రేలియానే ప్రేరణగా తీసుకుంటూ.. భార‌త వార్తాప‌త్రిక‌లు సైతం.. తాము ఎంతో ఖ‌ర్చు చేసి సంగ్రహిస్తున్న విశ్వ‌స‌నీయ స‌మాచారాన్ని గూగుల్‌కు మొద‌టి నుంచీ ఇస్తున్నామ‌ని ఐఎన్ఎస్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఏడాది కాలం నుంచి ఇందులోనూ వాటా ఇవ్వాల‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు న్యూస్ పేపర్లు గూగుల్‌ను డిమాండ్ చేస్తున్నాయి.

ఈ మ‌ధ్యే ఫ్రాన్స్‌, యురోపియ‌న్ యూనియ‌న్‌, ఆస్ట్రేలియాలోనూ ప‌రిహారం చెల్లించ‌డానికి గూగుల్ అంగీక‌రించింద‌ని కూడా తెలిపింది. ప‌త్రిక‌లు ప్ర‌ధానంగా యాడ్స్‌పైనే ఆధార‌ప‌డ‌తాయ‌ని, డిజిట‌ల్ స్పేస్‌లో మాత్రం మెజార్టీ వాటాను గూగుల్ తీసేసుకుని తమను నష్టానికి గురిచేస్తుందని ఆరోపించారు.