IndVsEng: 337పరుగులకే టీమిండియా ఆలౌట్

IndVsEng: 337పరుగులకే టీమిండియా ఆలౌట్

Ind Vs Eng: చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్ స్కోరు 257/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా మరో 80పరుగులు జోడించి చివరి 4వికెట్లు కోల్పోయింది. 91 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో కలిసి 31 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, జాక్ లీచ్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత షాబర్ నదీమ్ డకౌట్, ఇశాంత్ శర్మ 4, బుమ్రా డకౌట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా బౌండరీలతో బ్యాటింగ్ కొనసాగించిన వాషింగ్టన్ సుందర్ 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వాషింగ్టన్ సుందర్(85) రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెస్ 4 వికెట్లు ఆర్చర్, లీచ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, భారత్ ఇంకా 241 పరుగుల వెనుకంజలో ఉండగా.. కొద్దిసేపట్లో ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది.

అంతకముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ అయి ఇన్నింగ్స్ ముగించింది.. కెప్టెన్ జో రూట్(218: 377 బంతుల్లో 19ఫోర్లు, 2సిక్సులు) సూపర్ డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కి వెన్నెముకగా నిలవగా.. ఓపెనర్ సిబ్లీ(87: 286 బంతుల్లో 12ఫోర్లు), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82: 118 బంతుల్లో 10ఫోర్లు, 3సిక్సులు) మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సహాయపడ్డారు. అటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెస్(34) కూడా రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్, నదీమ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు.