అంతరిక్షంలో తినడానికి ఆవకాయ, బిర్యానీ రెడీ

అంతరిక్షంలో తినడానికి ఆవకాయ, బిర్యానీ రెడీ

Space Food: వారాల తరబడి అంతరిక్షంలో గడిపే వ్యోమగాములు ఏం తింటారు.. వాళ్ల ఫుడ్ ఎలా ఉంటుందని ఆలోచించారా.. వాళ్లకు స్పెషల్ ఫుడ్ ఉండాలి. విదేశీ వ్యోమగాములు తీసుకునే ఫుడ్.. ఇండియన్ వ్యోమగాములకు సెట్ అవదు కదా. అందుకే భారత వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా ప్యాకింగ్ ఫుడ్‌ను తయారు చేసింది డిఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (DFRL). పోషకాలు, ప్రొటీన్లు లాంటివి సమతుల్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

మైసూర్ కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థ.. త్వరలో చేపట్టనున్న గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం మీల్స్ రెడీ టు ఈట్‌ (MRE) ప్యాకింగ్ ఫుడ్‌ను రెడీ చేశారు. ఆవకాయ పచ్చడి, చికెన్ కుర్మా, బిర్యానీ, మూంగ్‌దాల్ హల్వా.. వంటి 40 రకాల పదార్థాలను తయారు చేసినట్లు ల్యాబ్‌లో ఒక అధికారి తెలియజేశారు.

ఈ ప్రత్యేకమైన ఆహారపదార్థాలను.. ఒక్కో వంటకాన్ని నాలుగు లేయర్లు ఉండే ప్యాకింగ్ కంటైనర్‌లో నిల్వ చేస్తున్నారు. ఈ ప్యాకెట్లు సైజులో చిన్నవిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కసారి ఓపెన్ చేస్తే అయిపోయేలా వీటిని రూపొందిస్తున్నారు. ఇలా రెడీ చేసేందుకు సంవత్సర కాలం పట్టిందని అధికారులు వివరించారు. అంతరిక్షంలోనే వీటిని వేడి చేసేలా హీటర్లను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇండియన్ MREలు ఇతర దేశాల వాటితో పోలిస్తే ఏమాత్రం తీసిపోవు. తొమ్మిది నెలల నుంచి సంవత్సరం వరకూ పాడవకుండా ఉంటాయి. వండాల్సిన అవసరం లేని పౌచ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి ఇందులో ఉన్నాయి. అయితే బరువు, పరిమాణం సమంగా ఉంటుంది. తినడానికి సులువుగా ఉండేలా వీటిని రూపొందించారు. పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. వీటిని కూడా 4 పొరలు ఉండే కంటైనర్లలో నిల్వ చేశారు. వాటర్ బాటిళ్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా వీటిని రెడీ చేశారు.

ఫుడ్ ఐటెంలను వేడి చేసుకోవడానికి DFRL రీఛార్జబుల్ సెల్ఫ్ హీటింగ్ ఫుడ్ వార్మర్స్‌ను తయారు చేస్తోంది. వ్యోమగాములు ఉండే ప్రాంతం చల్లగా ఉండటం వల్ల ఈ ఫుడ్ ప్యాకెట్లను నేరుగా ఓపెన్ చేసి, తినే అవకాశం ఉండకపోవచ్చు. ఒక్కోసారి అక్కడ -20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అందుకే ఆహారాన్ని వేడి చేసేందుకు హై ఆల్టిట్యూడ్ వద్ద కూడా సమర్థంగా పనిచేసే హీటర్లను రూపొందిస్తున్నారు.

20 డిగ్రీల వరకు వేడిని సృష్టించగల హీటర్లను బ్యాటరీలు, సోలార్ పవర్, జనరేటర్లతో తయారు చేస్తున్నారు. ప్యాకింగ్ ఫుడ్‌ను 15 నిమిషాల వరకు వేడి చేసి తినాల్సి ఉంటుంది. ఫుడ్ ప్యాకెట్లను ఇప్పటికే పరీక్షించామని అనుకూల ఫలితాలే వచ్చాయని అధికారులు అంటున్నారు.