షాక్ ఇచ్చి టీమిండియాను గట్టెక్కించిన టెయిలెండర్లు..

షాక్ ఇచ్చి టీమిండియాను గట్టెక్కించిన టెయిలెండర్లు..

Shardul -Sundar rescue act: భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అనూహ్య ప్రదర్శన కనబరుస్తున్నారు టీమిండియా ప్లేయర్లు. ఆఖరి టెస్టులో మూడో రోజు ఆటను టీమిండియా టెయిలెండర్లు శార్దుల్‌ ఠాకూర్‌ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్‌ సుందర్‌ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్‌) తిప్పేశారు. ఆదివారం తొమ్మిది మంది బ్యాటింగ్‌కు దిగిన జట్టులో ఆసీస్ బౌలర్లకు మాత్రం చెమటలు పట్టిస్తూ ఆటాడుకున్నారు. భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించారు.

కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న వాషింగ్టన్‌ సుందర్‌.. రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న శార్దుల్‌ ఠాకూర్‌లు బౌలింగ్‌ కేటగిరీలోనే చివరి స్థానంలో జట్టులోకి వచ్చారు. బ్యాటింగ్‌ చేసే సత్తా ఉందని తెలిసినా.. స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌నే గడగడలాడిస్తున్న ఆసీస్‌ ఫేజర్ల(హాజల్‌వుడ్, కమిన్స్, స్టార్క్‌)ను ఎదుర్కోగలరని ఎవరూ ఊహించలేదు. నిదానంగా ఇన్నింగ్స్ ను బలపరిచేదిశగా ఆడారు. పంత్ ను అవుట్ చేసి హమ్మయ్య అనుకున్న ఆసీస్ కు ఔరా అనిపించేలా ఆడారు.

ఇద్దరూ హాప్ సెంచరీ చేసి భారత్‌ ఇన్నింగ్స్‌ను పటిష్టస్థితికి తీసుకెళ్లి ప్రత్యర్థి బౌలింగ్‌ను నీరుగార్చేశారు. జట్టు స్కోరు 300 మార్క్‌ను దాటింది. గబ్బాలో ఏడో వికెట్‌కు అత్యధికంగా 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక శార్దుల్‌ ఔటయ్యాడు. తర్వాత భారత్‌ ఇన్నింగ్స్‌ ఎంతో సేపు సాగలేదు. సైనీ (5), సిరాజ్‌ (13)లను హాజల్‌వుడ్‌ … సుందర్‌ను స్టార్క్‌ అవుట్‌ చేయడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసింది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 111.4 ఓవర్లలో 336 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్ హాజిల్‌వుడ్‌ (5/57)తో ఆకట్టుకున్నాడు. నాలుగో రోజు రెండు జట్ల ఆటతీరే మ్యాచ్‌ ఫలితంతో పాటు సిరీస్ ఫలితాన్ని ఎవరివైపు మొగ్గు చూపుతుందో తేల్చనుంది. భారత బౌలర్లు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తారా… భారత బౌలింగ్‌ను ధీమాగా ఎదుర్కొని భారీ స్కోరు చేసి ఆసీస్‌ నిలబడుతుందా వేచి చూడాలి.