వాట్సప్ నుంచి సిగ్నల్‌కు మారాలనుకుంటున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి?

వాట్సప్ నుంచి సిగ్నల్‌కు మారాలనుకుంటున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి?

SIGNAL APP: ఇండియాలో కొత్త ప్రైవసీ పాలసీ గురించి ప్రచారం జరిగాక ఫేస్‌బుక్ కంపెనీ అయిన వాట్సప్ నుంచి చాలా మంది సిగ్నల్ కు మారిపోతున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా నడిపిస్తుండటమే ఆ మెసేజింగ్ యాప్ ప్రధాన బలం. వాట్సప్ చేసినట్లుగానే మెసేజ్ ల విషయంలో ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేస్తుంటుంది సిగ్నల్.

ఎలోన్ మస్క్ ట్విట్టర్ వేదికగా సిగ్నల్ వాడమని హింట్ ఇచ్చేసరికి వాట్సప్ ను వదిలి వెళ్లిపోయేందుకు చాలా మంది రెడీ అయిపోయారు. మరి కొత్త మెసేజింగ్ ప్లాట్ ఫాంకు వెళ్లాలనుకునే వారు దాని గురించి తెలుసుకోవాలి కదా.

సిగ్నల్ క్రియేట్ చేసుకోవడం
సిగ్నల్ క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్. వాట్సప్ క్రియేట్ చేసినట్లుగానే.. ఫోన్ నెంబర్ తో పాటు వెరిఫికేషన్ నెంబర్ కూడా ఎంటర్ చేయడంతో యాప్ లో అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడే నాలుగు అంకెల సెక్యూరిటీ పిన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. రోజుకొకసారి పిన్ ఎంటర్ చేస్తేనే యాప్ ఓపెన్ అవుతుంది.

సిగ్నల్ వర్సెస్ వాట్సప్.. ఎలా కంపేర్ చేయగలం
వాట్సప్ లో ఉన్న ఫీచర్లు సిగ్నల్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. అందుకే యూజర్లు ఏ మాత్రం ఆలోచించకుండా మెసేజింగ్ యాప్ ను మార్చేస్తున్నారు. వాట్సప్ మాదిరిగానే సిగ్నల్ కూడా ఆడియో, వీడియో కాల్స్ కు ఓకే అంటుంది. గ్రూపులో ఒకేసారి 8మంది వరకూ కాల్ చేసుకోవచ్చు. పైగా ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో కూడా అందుబాటులో ఉంది.

అవతలి నుంచి మరో వ్యక్తి కాల్ చేసినప్పుడు వాట్సప్ లాగే సిగ్నల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రింగింగ్ లేదా.. వైబ్రేషన్ మనం పెట్టుకున్న సెట్టింగ్ ను బట్టి అలర్ట్ ఇస్తుంది. మరోవైపు ఇంటర్నెట్ కనెక్షన్ వీక్ గా ఉందా.. లేదంటే అస్సలు ఇంటర్నెట్ కనెక్షన్ లేదా అని కూడా డిస్ ప్లే అవుతుంది. రింగింగ్ అనేది కనిపించకపోతే అవతలి వ్యక్తికి సరైన ఇంటర్నెట్ కనెక్షన్ లేదని అర్థం అయిపోతుంది.

కాల్ క్వాలిటీతో పోల్చుకుంటే వాట్సప్ కు దగ్గర్లోనే ఉంది. అది కాకుండా యూజర్లు చాట్ చేసుకోవడానికి అటాచ్ మెంట్లు, గిఫ్ లు, ఇమేజెస్, వీడియోస్, కాంటాక్ట్ లు, లొకేషన్లు, డాక్యుమెంట్లు ఇలా ఏది కావాలన్నా షేర్ చేసుకోవచ్చు. కాకపోతే సిగ్నల్ లో ఇంకా లైవ్ లొకేషన్ షేరింగ్ ఆప్షన్ అందుబాటులో లేదు.

మరోవైపు వాట్సప్ లో ఉన్నన్ని స్టిక్కర్లు సిగ్నల్ యాప్ లో లేవు. కేవలం లిమిటెడ్ సంఖ్యలోనే ఉన్నాయి. పేమెంట్ ఆప్షన్ కూడా సిగ్నల్ అందివ్వలేకపోతుంది. వాట్సప్ లో యూపీఐ ఐడీ యాడ్ చేసుకుని.. పేమెంట్ ఫీచర్ ను వాడుకోవచ్చు.

కొన్నేళ్ల నుంచి వాట్సప్ పై జరుగుతున్న దుష్ప్రచారం.. కారణంగా వాట్సప్ లో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో ఒకటేంటంటే ఫార్వార్డ్ మెసేజింగ్ ఆప్షన్. ఒకటి కంటే ఎక్కువ మందికి మెసేజ్ ను పంపిస్తే చాటింగ్ లో ఫార్వార్డ్ చాలా మందికి చేశారని డిస్ ప్లే అవుతుంది.

సిగ్నల్ లో అలాంటి ఫీచర్ ఇంకా రాలేదు. చాలా తక్కువ సమయంలో తీసుకున్న నిర్ణయం కావడంతో ఎక్కువ మంది సిగ్నల్ కు మారిపోయారే కానీ, ఫీచర్ల గురించి పట్టించుకోవడం లేదు. ఈ కొన్ని అంశాలు అవసరం లేదనుకుంటే వాట్సప్ నుంచి సిగ్నల్ కు వెళ్లిపోవచ్చు. అన్నీ కావాలనుకుంటే మాత్రం కాస్త ఆగాల్సిందే.