భారత్ కు టెస్లా, యడియూరప్ప సంతోషం

10TV Telugu News

Tesla Makes India Entry : అమెరికాలోని ప్రఖ్యాత ఎలక్రిక్ట్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌పై ఫోకస్ పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్‌లోకి అడుగులు వేస్తోంది. తాజాగా భారత్‌లో తన సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా.. అందుకు కర్నాటక వేదికగా మారింది. బెంగళూరులో ఆర్ అండ్ డీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టెస్లా మోటార్స్ ఇండియా అండ్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో ఈ నెల 8వ తేదీని రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసింది.

దేశంలోనే మొదటిసారిగా టెస్లా కర్నాటకలో అడుగు పెట్టనుండటంతో ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప సంతోషం వ్యక్తం చేశారు. టెస్లాకు, ఆ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్‌కు శుభాకాంక్షలు చెప్పారు. గ్రీన్ మొబలిటి కర్నాటక నుంచే మొదలు కాబోతుందని.. త్వరలోనే టెస్లా కార్ల ఉత్పత్తిని స్టార్ట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టెస్లా మోటార్స్ ఇండియా అండ్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీకి ముగ్గురు డైరెక్టర్లను కూడా టెస్లా నియమించింది. అంతకు ముందు టెస్లా కర్నాటకతో పాటు మరో ఐదు రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా సంప్రదింపులు జరిపింది. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలతో కూడా చర్చలు జరిపింది. చివరకు బెంగళూరులో ఆఫీస్‌ను ఓపెన్ చేసింది.