చైనాకు షాక్ : భారత్‌-అమెరికా యుద్ధ విన్యాసాలు…రంగంలోకి నిమిజ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లడఖ్ సరిహద్దులో భారత్‌-చైనాల మధ్య వివాదం నేపథ్యంలో భారత యుద్ధనౌకలతో​ కలిసి సంయుక్త విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధనౌక యూఎస్‌ నిమిజ్‌ అండమాన్‌, నికోబార్‌ దీవుల సమీపంలో హిందూ మహాసముద్రానికి చేరుకుంది.

లక్ష టన్నుల బరువుండే అమెరికా నిమిజ్‌ నౌక 90 యుద్ధ విమానాలను మోయగల సామర్ధ్యం కలిగిఉంది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో జరుగుతున్న విన్యాసాల్లో సబ్‌మెరైన్లు సహా పలు భారత యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి.

అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌ (ఏఎన్‌సీ)తో పాటు తూర్పు నావల్‌ కమాండ్‌కు చెందిన నౌకలు విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో దూకుడు పెంచిన డ్రాగన్‌కు ఈ పరిణామం దీటైన సంకేతం పంపుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

దక్షిణ చైనా సముద్రంలో వ్మూహాత్మక జలాలపై ప్రపంచ దేశాలన్నింటికీ ఉమ్మడి భాగస్వామ్యం ఉంటుందని భారత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విన్యాసాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ప్రాంతంలో శాంతి సుస్ధిరతలను భారత్‌ కోరుకుంటుందని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా దక్షిణ చైనా సముద్రంలో స్వేఛ్చా నావిగేషన్‌, చట్టబద్ధ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

దక్షిణ చైనా సముద్రంలో ఏ దేశాల హక్కులను డ్రాగన్‌ హరించినా ఆయా దేశాలకు ట్రంప్‌ యంత్రాంగం అండగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో​ స్పష్టం చేసిన క్రమంలో భారత్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. గత కొద్ది రోజులుగా ట్రంప్‌ యం​త్రాంగం దక్షిణ చైనా సముద్రంపై తన వైఖరిని కఠినతరం చేసింది. ఆ ప్రాంతంలో ఇతర దేశాల ఆందోళనలను విస్మరిస్తూ దక్షిణ చైనా ప్రాంతంలో మారిటైమ్‌ సామ్రాజ్యం నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపించింది

Related Posts