Indians To Fly Out Of China Tonight. What Happens Next To Them

చైనా నుంచి ఈ రాత్రికే మనోళ్లు వస్తున్నారు.. వారిని ఎక్కడ ఉంచుతారో? రేపు రెండో విమానం వచ్చే అవకాశం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి ఇతర దేశాలకు పాకింది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న చైనాలో ఇప్పటివరకూ 200 మంది వరకు మృతిచెందారు. వేలాది మంది వైరస్ బారిన పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో చిక్కుకుపోయిన స్వదేశీయలను తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇతర దేశాలతో పాటు భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

చైనాలోని వుహాన్ సిటీలో చిక్కుకున్న 400 మంది భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపింది భారత ప్రభుత్వం. ఎయిర్ ఇండియా విమానం ఈ రోజు మధ్యాహ్నామే ఢిల్లీ నుంచి చైనాకు బయల్దేరింది. ముంబై హబ్ కు చెందిన బోయింగ్ 747 జుంబో జెట్ ను విమానయాన సంస్థ ఏర్పాటు చేసింది. ఈ విమానంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన ప్రత్యేకమైన మెడికల్ కిట్స్‌ను తరలిస్తోంది.

శనివారం చేరుకోనున్న రెండో విమానం :
మరో ఆరు గంటల్లో వుహాన్ సిటీకి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం చేరుకోనుంది. చైనాలో రెండు నుంచి మూడు గంటల పాటు ఉండనుంది. చైనా నుంచి ఈ శుక్రవారం (జనవరి 31, 2020) రాత్రికే భారతీయులతో స్వదేశానికి చేరుకోనుంది. రెండో విమానం శనివారం (ఫిబ్రవరి 1, 2020) వుహాన్ నుంచి బయల్దేరే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

వారిని ఎక్కడికి తీసుకెళ్తారో :
చైనా నుంచి స్వదేశానికి తీసుకొచ్చిన భారతీయులను ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్లనున్నారు.. ఏ ప్రాంతంలో ఉంచనున్నారు. ప్రధాన భూభాగానికి దూరంగా ఉంచుతారా? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ అనుమానితుల కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, మానేసర్ నిర్మానుష్య ప్రాంతాల్లో స్పెషల్ వార్డులను ఏర్పాటు చేశారు. వుహాన్ సిటీ నుంచి భారతీయులను 14 రోజుల పాటు ఇక్కడే ఉంచి పర్యవేక్షించనున్నారు.

జనారణ్యంలోకి తీసుకొస్తే మరింత మందికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో వారిని దూరంగా ఉంచనున్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఎయిర్ ఇండియా నుంచి ఒక ప్యారమెడిక్, ఢిల్లీ రామ్ మనోహార్ లోహియా ఆస్పత్రి నుంచి 5 వైద్యులతో విమానం వెళ్లింది. వారితో పాటు స్పెషల్ మెడికల్ కిట్స్ కూడా వెంట తీసుకెళ్లారు. చేతులకు గ్లోవ్స్, మాస్క్ లు, మెడిసిన్స్ అవసరమైన అత్యవసర సామాగ్రి మొత్తం విమానంలో తీసుకెళ్లారు.

విమానంలో వెళ్లిన విమాన సిబ్బంది, పైలట్లు, ఇంజినీర్లు, భద్రతా సిబ్బంది, వైద్యులను చైనా నుంచి తిరిగి వచ్చాక ఇంట్లో వారం పాటు ప్రత్యేక వార్డుల్లో ఉంచనున్నారు. వారిలో ఏమైనా వైరస్ బాధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే రిపోర్టు చేయాల్సిందిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. విమానంలో తీసుకొచ్చే ప్రయాణికులతో విమాన సిబ్బంది దూరంగా ఉండి వారికి అవసరమైన ఫుడ్, వాటర్ ఒక్కో సీటులో ముందే ఏర్పాటు చేయనున్నారు.

Related Tags :

Related Posts :