Home » ఇండోనేషియాలో ముందుగా యువతకే కరోనా వ్యాక్సిన్.. ఎందుకో తెలుసా?
Published
1 week agoon
Indonesia is vaccinating younger people first : ప్రపంచమంతా ముందుగా వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికే కరోనా వ్యాక్సిన్ అందిస్తామంటే.. ఇండోనేషియా మాత్రం తమదేశంలో ముందుగా యువకులకే కరోనా వ్యాక్సిన్ అందిస్తామంటోంది. చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ఇండోనేషియా విడుదల చేసేందుకు రెడీ అయింది. హెర్డ్ ఇమ్యూనిటీని సాధించే లక్ష్యంలో భాగంగా వృద్ధాప్య జనాభా కన్నా ముందుగా యువ జనాభాకు కరోనా ఇమ్యూనిటీని అందించవచ్చునని అంటోంది. ఎందుకిలానంటే.. వృద్ధులపై చైనా కరోనా టీకా సమర్థత గురించి ఇంకా తగినంత డేటా తమ వద్ద లేదని ఇండోనేషియా చెబుతోంది. దేశంలో ఇప్పటికీ వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. 18-59 ఏళ్ల వయస్సువారే ఈ ట్రయల్స్ లో పాల్గొన్నారు. కరోనా నిర్మూలనకు ఇండోనేషియా భారీగా టీకాలు వేసేందుకు రెడీ అవుతోంది.
హెర్డ్ ఇమ్యూనిటీని వేగంగా చేరుకోవాలంటే ముందుగా యువ జనాభాకు టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతోంది. అలాగే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు వృద్ధుల కంటే యువ జనాభాకు ప్రాధాన్యతనిచ్చే ప్రణాళికను ఇతర దేశాలు కూడా నిశితంగా పరిశీలించనున్నాయి. ఇప్పటికే టీకాలు ప్రారంభించిన అమెరికా, బ్రిటన్ వంటి అనేక దేశాలు శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడే వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇండోనేషియా టీకా విధివిధానాలపై నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందరికంటే ముందుగా ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగుల తర్వాత యువ జనాభాకు కరోనా టీకా వేయనున్నారు.
ముందుగా 18-59 ఏళ్ల వయస్సు వారే ఎందుకు?
చైనాకు సినోవాక్ బయోటెక్ వ్యాక్సిన్‌తో పెద్దమొత్తంలో కరోనా టీకాలు వేయాలని ఇండోనేషియా భావిస్తోంది. అయితే వృద్ధులపై వ్యాక్సిన్ సమర్థత గురించి ఇంకా తగినంత డేటా లేదని అంటోంది. అందుకే ముందుగా యువ జనాభానే ప్రాధాన్యతగా ఎంచుకున్నట్టు పేర్కొంది. దేశంలో క్లినికల్ ట్రయల్స్ డేటా 18ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు గలవారికి సంబంధించి మాత్రమే అందుబాటులో ఉంది. యువత సాధారణంగా చురుకైనవారు.. అందరితో సామాజికంగా కలుస్తుంటారు. ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు. వీరి ద్వారా కరోనావైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే వృద్ధులకు టీకాలు వేయడం కంటే యువతకే ముందు అనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చునని ఇండోనేషియా యోచిస్తోంది.వృద్ధులకు టీకా ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవడానికి దేశీయ డ్రగ్ రెగ్యులేటరీల నుంచి సిఫారసుల కోసం అధికారులు వేచిచూస్తున్నారు. ఇండోనేషియాకు సినోవాక్ వ్యాక్సిన్‌కు ప్రారంభ యాక్సస్ మాత్రమే అనుమతి ఉంది.
హెర్డ్ ఇమ్యూనిటీ త్వరగా పెరుగుతుందా? :
మొదట సామాజికంగా ఎక్కువగా అందరితో కలిసే గ్రూపులవారికి టీకాలు వేయనుంది. తద్వారా అతి త్వరలో హెర్డ్ ఇమ్యూనిటీని చేరగలమని ఇండోనేషియా ప్రభుత్వం భావిస్తోంది. హెర్డ్ ఇమ్యూనిటీని చేరుకోవడానికి దేశంలో 181.5 మిలియన్ల మందికి లేదా జనాభాలో సుమారు 67శాతం మందికి టీకాలు వేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 427 మిలియన్ మోతాదుల టీకాలు అవసరమని చెబుతోంది. హెర్డ్ ఇమ్యూనిటీని చేరుకోవడంలో కొంతమంది నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ టీకాలు వేసిన వ్యక్తులు వైరస్‌ను ఇతరులకు వ్యాప్తి చేయగలరా లేదా అని నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.