Home » భారత ఆటగాళ్లకు గాయాలే..గాయలు
Published
2 weeks agoon
Injuries to Indian players : నమ్మశక్యంగా అనిపించడం లేదు.. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుగలేదు.. ఒకరా.. ఇద్దరా.. టీమ్ఇండియా ఆటగాళ్లు వరుసగా గాయపడుతున్నారు. ఏ ముహూర్తాన ఆస్ట్రేలియా పర్యటన మొదలైందో కానీ భారత్ కష్టాలు పరాకాష్టకు చేరాయి. ఐపీఎల్లో గాయపడి కొందరు టూర్‌కు దూరమైతే ఆసీస్‌కు వచ్చాక ఇక్కట్లు రెట్టింపయ్యాయి. టెస్టు సిరీస్‌లో షమీ నుంచి బుమ్రా వరకు ఏకంగా ప్రధాన పేస్ దళం మొత్తం వైదొలిగింది. ఇదే సిరీస్‌తో అరంగేట్రం చేసిన హైదరాబాదీ మహమ్మద్ సిరాజే.. నిర్ణయాత్మక నాలుగో టెస్టులో ప్రధాన పేసర్ కానున్నాడు. సిడ్నీ టెస్టు హీరో హనుమ విహారి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ కూడా గాయపడడంతో బ్యాటింగ్ విభాగంలోనూ టీమ్ఇండియాకు ఎదురుదెబ్బలే తగిలాయి.
మూడో టెస్టు మ్యాచ్ :-
టీమ్ ఇండియాకు గాయాల బెడద తీవ్రమైంది. సిడ్నీ వేదికగా మూడో టెస్టులో గాయపడ్డ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగే నిర్ణయాత్మక మ్యాచ్‌కు దూరమయ్యాడు. అద్భుత పోరాటంతో మెప్పించి సిడ్నీ టెస్టును డ్రా చేసిన తెలుగు ఆటగాడు హనుమ విహారి, సూపర్ ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ జడేజా సైతం వైదొలిగారు.
అసమాన పోరాటంతో సిడ్నీ టెస్టులో చివరి రోజు 161 బంతులు ఆడిన హనుమ విహారికి తీవ్రమైన కండరాల గాయమైంది. దీంతో నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు నుంచి విహారి దాదాపు వైదొలిగినట్టే. మరోవైపు టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్, మంచి ఫామ్‌లో ఉన్న రవీంద్ర జడేజాకు సైతం మూడో టెస్టులోనే దెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్ వేసిన బంతి తగలడంతో జడేజా ఎడమ చేతి వేలికి తీవ్రమైన గాయమైనట్టు స్కానింగ్‌లో తేలింది. దీంతో కనీసం రెండు నెలలు అతడు జట్టుకు దూరం కానుండగా.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సైతం అందుబాటులో ఉండడం లేదు.
జాగ్రత్త పడుతున్న టీమ్ :-
బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నా బుమ్రాకు ఉదర కండరాలు పట్టేయడంతో అతడు నాలుగో టెస్ట్‌కు దూరమయ్యాడు. సిడ్నీ టెస్ట్ ఆడుతున్న సమయంలోనే బుమ్రా గాయపడ్డాడు. స్కానింగ్ తీయగా.. కండరాలు పట్టేసినట్లు తేలింది. ఆ గాయం పెద్దది కాకుండా చూడాలన్న ఉద్దేశంతో నాలుగో టెస్ట్‌లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఆసీస్‌తో సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఉండటంతో టీమ్ మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోకుండా జాగ్రత్త పడుతోంది. సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ పేసర్ కమిన్స్ వేసిన బంతి తగలడంతో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మోచేతికి గాయమైంది. అయితే ఫ్యాక్చర్ కాలేదని స్కానింగ్‌లో తేలడంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన అతడు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 97 పరుగులతో దాదాపు జట్టును గెలిపేంచే ప్రదర్శన చేసిన పంత్.. నాలుగు టెస్టులో ఆడనున్నాడు. అయితే కంప్లీట్ ఫిట్నెస్తో మాత్రం కాదు.
బ్రిస్బేన్ మ్యాచ్ :-
ఆస్ట్రేలియా పర్యటనకు గాయాల కష్టాలు దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్‌లోనే ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ తరఫున లీగ్‌లో ఆడిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కండరాల గాయం బారిన పడి టూర్‌కు దూరమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన సీనియర్ ఫాస్ట్‌బౌలర్ ఇషాంత్ శర్మ కూడా గాయపడ్డాడు. ఇక ఆసీస్ గడ్డపై టీ20లో అరంగేట్రం చాన్స్ వచ్చినా అప్పటికే భుజం గాయం కావడంతో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియాకు రాలేకపోయాడు. ఇక ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ కూడా గాయపడ్డారు. టీమ్‌లో ఏకంగా పది మందికి గాయాలు ఉండడం భారత్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. అయితే ఎన్ని ప్రతికూల అంశాలు ఉన్నా.. భారత్ జట్టు ప్రదర్శనల్లో ఏ మార్పు కనిపించడంలేదు. మరి బ్రిస్బేన్ మ్యాచ్‌లో కూడా అదే పట్టుదలతో ఆడుతారో లేదో వెయిట్ అండ్ సీ.