చైనాలో మళ్లీ కరోనా వైరస్ కలకలం, కోటి మంది జనాభా ఉండే మరో పెద్ద సిటీ లాక్ డౌన్

చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి మరోసారి ఆ దేశంలో కలకలం రేపింది. కరోనా వైరస్ వెలుగుచూడటంతో అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే మరో పెద్ద సిటీ హార్బిన్(harbin)ని లాక్ డౌన్ చేసిం

చైనాలో మళ్లీ కరోనా వైరస్ కలకలం, కోటి మంది జనాభా ఉండే మరో పెద్ద సిటీ లాక్ డౌన్

చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి మరోసారి ఆ దేశంలో కలకలం రేపింది. కరోనా వైరస్ వెలుగుచూడటంతో అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే మరో పెద్ద సిటీ హార్బిన్(harbin)ని లాక్ డౌన్ చేసింది. కరోనా వైరస్ కారణంగా వూహాన్ ను లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కంట్రోల్ కావడంతో వూహాన్ లో ఇటీవలే (సుమారు 70) రోజుల తర్వాత లాక్ డౌన్ ఎత్తివేశారు. ఇంతలోనే మరోసారి కరోనా కలకలం రేగింది. చైనాలోని అతి పెద్ద సిటీల్లో హార్బిన్ ఒకటి. అక్కడి కోటి మంది జనాభా నివాసం ఉంటారు.

న్యూయార్క్ నుంచి చైనా వచ్చిన విద్యార్థినికి కరోనా:
ఇటీవలే న్యూయార్క్ నుంచి ఓ విద్యార్థిని(22) చైనాకి తిరిగి వచ్చింది. ఆ విద్యార్థిని కరోనా బారిన పడింది. ఆమె కారణంగా 70మందికి కరోనా సోకింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు వెంటనే హార్బిన్ సిటీని పూర్తిగా లాక్ డౌన్ చేశారు. సదరు విద్యార్థిని మార్చిలో న్యూయార్క్ నుంచి చైనా వచ్చింది. ప్రభుత్వం ఆమెని 14 రోజుల క్వారంటైన్ లో ఉంచింది. అప్పుడు రిపోర్టులో నెగిటివ్ వచ్చింది. ఆ సమయంలో ఆమెలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. ఆ తర్వాత ఆమెని అధికారులు క్వారంటైన్ నుంచి పంపేశారు. ఆ తర్వాత కరోనా వైరస్ బయటపడింది. ఆమె కారణంగా 70మందికి కరోనా సోకింది.

గెట్ టు గెదర్ తర్వాత 70మందికి కరోనా:
క్వారంటైన్ నుంచి వెళ్లాక ఆ విద్యార్థిని తన ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండే వారితో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వేడుకకు హాజరైన వారిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. అలా అలా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ పోయింది. ఇప్పటివరకు 70మంది కరోనా బారిన పడ్డారు. 52 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 23మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. అలర్ట్ అయిన అధికారులు కరోనా మరింతగా వ్యాప్తి చెందకుండా వెంటనే హార్బిన్ సిటీని లాక్ డౌన్ చేశారు.

పెళ్లిళ్లు, వేడుకలపై నిషేధం:
హార్బిన్ లోని అన్ని కమ్యూనిటీలు, గ్రామాల ఎంట్రన్స్ లో గార్డులను పెట్టారు. లోనికి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా ప్రజలు హెల్త్ కోడ్ చూపించాల్సి ఉంటుంది. మాస్క్ లు వేసుకోవడం మస్ట్. అలాగే టెంపరేచర్ చెక్ చేస్తారు. కాగా బయటి వ్యక్తులకు మాత్రం లోనికి వెళ్లడానికి అనుమతి లేదు. అంతేకాదు పబ్లిక్ గ్యాథరింగ్స్, పెళ్లిళ్లు, అంతిమ సంస్కారాలు, వేడుకలపై నిషేధం విధించారు.

లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన వారి సమాచారం ఇస్తే రివార్డ్:
ఎవరైనా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసినా, ఇటీవలే బయటి దేశాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్ లో లేకపోయినా వారి గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తులకు రూ.32వేలు రివార్డ్ ఇస్తామని అధికారులు ప్రకటించారు.

2019 డిసెంబర్ లో వుహాన్ లో వెలుగుచూసిన కరోనా:
2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా చైనా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. వేల సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. 70 రోజుల పాటు వూహాన్ లాక్ డౌన్ లో ఉంది. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో కొన్ని రోజుల క్రితమే వూహాన్ లో లాక్ డౌన్ ఎత్తేశారు. దీంతో హమ్మయ్య అని అంతా ఊపిరిపీల్చుకున్నారు. రిలాక్స్ అయ్యే లోపే మరోసారి చైనాలో కరోనా వైరస్ వెలుగు చూడటం ఆందోళనకు గురి చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా 26లక్షల కరోనా కేసులు, లక్షా 86వేల మరణాలు:
వుహాన్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. సుమారు 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 26లక్షల మంది కరోనా బారిన పడ్డారు. లక్షా 86వేల మంది మరణించారు. కంటికి కనిపించని ఈ శత్రువుపై విజయం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పోరాటం చేస్తున్నారు. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.