కొంపముంచిన లాక్‌డౌన్ సడలింపు: జర్మనీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 07:48 AM IST
కొంపముంచిన లాక్‌డౌన్ సడలింపు: జర్మనీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

జర్మనీలో కరోనా ఇన్ఫెక్షన్లు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. అధికారిక డేటా ప్రకారం.. దేశంలో లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన కొద్దిరోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయాయి. Robert Koch Institute (RKI) రిప్రోడక్షన్ రేటును పరిశీలిస్తే.. కరోనా పాజటివ్ ధ్రువీకరణ కేసుల అంచనా ఇప్పుడు ఒకటికిపైగా చేరింది. అంటే.. జర్మనీలో కరోనా కేసులు ఇప్పుడు పెరుగుతున్నాయని దీని అర్థం.. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయాలంటూ వేలాది మంది జర్మనీయులు శనివారం ఒకేచోట చేరి పిలుపునిచ్చిన తర్వాత ఈ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. 

దేశీయంగా లాక్‌డౌన్ ఆంక్షల సడలింపును బుధవారం చాన్సలర్ Angela Merkel ప్రకటించారు. జర్మనీలోని 16 రాష్ట్రాల నేతలతో కలిసి చర్చించిన అనంతరం మెర్కెల్ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. అన్ని షాపులను తిరిగి తెరిచేందుకు అనుమతినిచ్చారు. విద్యార్థులు కూడా నెమ్మదిగా తమ స్కూళ్లకు వెళ్తున్నారు. జర్మనీ టాప్ ఫుట్ బాల్ లీగ్ Bundesliga కూడా వచ్చేవారంతంలో మ్యాచ్ పున: ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ, దేశవ్యాప్తంగా చాలామంది లాక్ డౌన్ ఎత్తివేత చర్యలను వేగంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో జర్మనీ ఏడో అత్యధిక కరోనా ధ్రువీకరణ కేసులు నమోదైన దేశంగా నిలిచింది. లేటెస్ట్ RKI డేటా ప్రకారం.. జర్మనీలో ఆదివారం నాటికి 1,69,218 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 7,395కు చేరింది. 

రిపోర్టు ఏం చెబుతోంది :
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత రేటు క్రమంగా పెరుగుతోంది. ఫిక్సడ్ నెంబర్లలో మాత్రం కాదు. జర్మనీయుల ప్రవర్తనాశైలిలో మార్పు లేదా వారిలో వ్యాధినిరోధకత అభివృద్ధి చెందడంతో వ్యాధి సంక్రమణ రేటులో మార్పు కనిపిస్తోంది. ప్రజారోగ్య సంస్థ శనివారం రిలీజ్ చేసిన రిపోర్టు ప్రకారం.. రిప్రొడక్షన్ రేటు 1.1 గా అంచనా వేసింది. ఆదివారం నాటికి 1.13కి చేరింది. గత మూడు వారాల్లో దాదాపు 1 లోపు కేసుల సంఖ్య నమోదైంది. ఇతర యూరోపియన్ దేశాల్లో కంటే జర్మనీలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణం.. అక్కడి లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయడమే.. అంతేకాదు.. ఎక్కువమందికి కరోనా పరీక్షలు చేయడంతో వైరస్ వ్యాప్తిని జర్మనీ కట్టడి చేయగలిగింది. 

లాక్ డౌన్‌ను జర్మనీ ఎలా తీసుకుంది?:
దేశంలో చాలామంది లాక్ డౌన్ ఆంక్షలను సడలించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం లాక్ డౌన్ కొనసాగింపుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి వారాల్లో చిన్న మొత్తంలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కానీ, శనివారం మాత్రం.. దేశవ్యాప్తంగా బెర్లిన్, ఫ్రాంక్ ఫర్ట్, మునీచ్, షట్‌గార్ట్ సహా పలు నగరాల్లోని వేలాది మంది నగరవాసులు ఒకేచోట చేరి లాక్ డౌన్ కు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. భౌతిక దూర నిబంధనలను అతిక్రమించిన 30మందిని బెర్లిన్ పోలీసులు Reichstag బయటి ప్రాంతంలో అరెస్ట్ చేశారు.