ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా…అమెరికాలో 16,454 మంది మృతి

కరోనా దెబ్బతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలకు చేరువైంది. కరోనా మరణాల్లో అమెరికా సెకండ్‌ ప్లేస్‌లోకి వచ్చేసింది.

  • Published By: veegamteam ,Published On : April 10, 2020 / 12:48 AM IST
ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా…అమెరికాలో 16,454 మంది మృతి

కరోనా దెబ్బతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలకు చేరువైంది. కరోనా మరణాల్లో అమెరికా సెకండ్‌ ప్లేస్‌లోకి వచ్చేసింది.

కరోనా దెబ్బతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. వైరస్‌ మహమ్మారి ఇప్పటి వరకు  209 దేశాలకు విస్తరించింది.  వైరస్‌ బారిన పడిన దేశాలన్నీ వణుకుతున్నాయి. చైనాలో పుట్టిన ఈ రాకాసి.. రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలకు చేరువైంది. నిన్న కొత్తగా 75 లక్షల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. ఇక 95వేల మందిని ఈ మహమ్మారి ఇప్పటి వరకు బలితీసుకుంది. నిన్న ఒక్కరోజే 6500లకుపైగా మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి 3 లక్షల 55వేల బాధితులు కోలుకోగా.. ఇంకా 48వేల మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది.

కరోనా ధాటికి అగ్రరాజ్యం చిగురుటాకులా వణికిపోతుంది. కనీవినీ ఎరుగని స్థాయిలో వైరస్ విజృంభిస్తుండడంతో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. కరోనా మరణాల్లో అమెరికా సెకండ్‌ ప్లేస్‌లోకి వచ్చేసింది. ఇక్కడ మరణాల సంఖ్య 16వేలు దాటాయి. నిన్నఒక్కరోజే దాదాపు 17వందల మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి. 7వేల మంది ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే చనిపోయారు.  మరోపైపు  బాధితుల సంఖ్య  ఇప్పటికే 4 లక్షల 60వేలు దాటింది. నిన్న కొత్తగా 28వేల మందికి కరోనా పాటిజివ్‌ వచ్చింది. 9 వేల 265 మంది పరిస్థితి విషమంగా ఉంది. 

స్పెయిన్‌లో కరోనా కాస్త శాంతించినట్టుగా తెలుస్తోంది. గత ఐదారు రోజులుగా బాధితుల సంఖ్య తగ్గుతోంది. అటు మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి.  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ దేశంలో లక్షా 52వేల మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. నిన్న కొత్తగా 4వేలకుపైగా కేసులు నిర్ధారణ అర్యాయి. ఇక ఈ దేశంలో ఇప్పటి వరకు 15 వేల 238మంది కోవిడ్‌ కారణంగా చనిపోయారు. నిన్న ఒక్కరోజే 446మంది ప్రాణాలు విడిచారు.

ఇటలీలోనూ పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. రోజూ వెయ్యికిపైగా ఉండే మరణాలు ఇప్పుడు కాస్త తగ్గాయి. నిన్న  610మందిని రాకాసి బలితీసుకుంది. దీంతో ఈ దేశంలో మృతుల సంఖ్‌ 18వేల 279కు పెరిగింది. కోవిడ్‌ మరణాల్లో ప్రపంచంలో ఇటలీయే ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. ఇక ఇక్కడ లక్షా 43వేలకుపైగా కరోనా కేసులు నమోదుకాగా… నిన్న ఒక్కరోజే కొత్తగా 4వేల 200 కేసులు వెలుగుచూశాయి.

బ్రిటన్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ దేశంలో 65వేల మంది బాధితులు నమోదయ్యారు. నిన్న కొత్తగా 4344మందికి వైరస్‌ సోకింది. ఇక నిన్న ఒక్కరోజే 881మందిచనిపోవడంతో… మృతుల సంఖ్య 8వేలకు  చేరువైంది.

ఇరాన్‌లోనూ కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఈ దేశంలో కరోనా మరణాలు 4వేలు దాటాయి. అటు బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న 1634 మందిలో కోవిడ్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆ దేశంలో బాధితుల సంఖ్య 66వేలు దాటిపోయింది. కరోనా కట్టడికి ఇరాన్‌ ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. అయినా మహమ్మారిని మాత్రం అదుపుచేయలేకపోతోంది.

Also Read | భారత్‌లో కరోనా విజృంభణ…5,865 పాజిటివ్ కేసులు..169 మంది మృతి