50 దేశాల్లో 170 కోట్ల మంది హోం క్వారంటైన్

  • Published By: chvmurthy ,Published On : March 24, 2020 / 02:25 AM IST
50 దేశాల్లో 170 కోట్ల మంది హోం క్వారంటైన్

రోజురోజు కు పెరిగిపోతున్న కరోనా వైరస్‌  కట్టడికి ప్రపంచ దేశాలు తమ చర్యలను వేగవంతం చేశాయి. ఇప్పటికే 50కి పైగా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఆ జాబితాలో ఫ్రాన్స్‌, ఇటలీ, అర్జెంటీనా, అమెరికా, ఇరాక్‌, రువాండా, గ్రీస్‌  కూడా ఉన్నాయి. బుర్కినా ఫాసో, చిలీ, ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా, సెర్బియా, మౌరిటానియా దేశాల్లో ఇప్పటికే కర్ఫ్యూ విధించగా, సోమవారం సాయంత్రం నుంచి సౌదీ అరేబియాలో కూడా  కర్ఫ్యూ విధించారు. 

ఇరాన్‌, జర్మనీ, బ్రిటన్‌లు తమ ప్రజలను ఇళ్లలోనే ఉండాలని కోరాయి. 10 దేశాలు కర్ఫ్యూతోపాటు రాత్రివేళ ప్రయాణాలపై నిషేధం విధించాయి. ప్రపంచ వ్యాప్తంగా 174 దేశాల్లో సోమవారం నాటికి 15,873 మంది మృతి చెందారు. 3 లక్షల 50 వేల 142 మందికి వైరస్‌ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. 50కి పైగా దేశాలు 170 కోట్ల మంది ప్రజలను ఇండ్లకే పరిమితం కావాలని కోరాయి. 

ఇటలీ దేశంలో సోమవారం నాటికి 6,077 మంది మృత్యువాత పడగా, 63,927 మందికి వ్యాధి సోకింది. చైనాలో స్థానికంగా కేసులు నమోదు కావడం నిలిచిపోయింది. కొత్తగా విదేశాల నుంచి వచ్చిన వారిలో 39 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలగా, తొమ్మిది మంది మరణించారు. దీంతో చైనాలో మృతుల సంఖ్య 3,270కు చేరగా, 81,093 మందికి వైరస్‌ సోకింది. స్పెయిన్‌లో 2,207 మంది, ఇరాన్‌లో 1,812, ఫ్రాన్స్‌లో 674, అమెరికాలో 501 మంది మరణించారు. 

అమెరికా సెనెటర్‌ రాండ్‌ పాల్‌కు కరోనా వైరస్‌ సోకింది. సెనెట్‌లో వైరస్‌ బారిన పడిన వారిలో ఆయన తొలి సెనెటర్‌ కావడం గమనార్హం. చెక్‌ రిపబ్లిక్‌, నైజీరియా, మాంటెనెగ్రోలలో ఆదివారం తొలి మరణాలు నమోదయ్యా యి. పాపువా న్యూగునియా, సిరియాల్లో తొలి కేసులు రికార్డయ్యాయి. పశ్చిమాసియాలో 1841 మృతు లు నమోదు కాగా, 26,688 మందికి వైరస్‌ సోకింది. ఆఫ్రికాలో 49 మంది మృతి చెందగా, 1,479 కేసులు నమోదయ్యాయి.

See Also | కరోనా రోగి ఉన్నాడని..పైలట్ ఏం చేశాడో తెలుసా