ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 23మంది మృతి

ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 23మంది మృతి

23 die in Norway Pfizer COVID-19 Vaccine : నార్వేలో ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న కొద్దిరోజుల్లోనే 23 మంది మరణించారు. వీరిలో 13 మంది నర్సింగ్ హోం బాధితులు ఉండగా.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించి సమస్యలు వచ్చాయని వైద్యాధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ అనంతరం చాలామందిలో జ్వరం, వికారం వంటి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని తెలిపారు.

కొంతమందిలో వ్యాక్సిన్ దుష్ప్రభావాల కారణంగానే మరణానికి దారితీసినట్టు నార్వే మెడిసిన్స్ ఏజెన్సీ చీఫ్ ఫిజిషియన్ Sigurd Hortemo తెలిపారు. టీకా అనంతరం మరణించిన 13 మంది నర్సింగ్ హోం బాధితుల్లో ఎక్కువగా 80ఏళ్లు వయస్సు వారే ఉన్నారు. ఫైజర్ టీకా తీసుకున్న ఇద్దరు నర్సింగ్ హోం నివాసులు మరణించిన వారం తర్వాత ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఫైజర్, మోడ్రెనా కరోనా వ్యాక్సిన్లు తొలి షాట్లను నార్వేలో 30వేల మందికి పైగా తీసుకున్నారు. ఈ రెండు వ్యాక్సిన్లతో తక్కువ ముప్పు మాత్రమే ఉందని, ఇతర కారణాలతోనే టీకా తీసుకున్న అనంతరం కొంతమంది మరణించి ఉండొచ్చునని అధికారులు తెలిపారు.

అందుకే కరోనా వ్యాక్సిన్ ఎవరికి ముందుగా వేయాలనేది వైద్యులు జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలని మెడికల్ డైరెక్టర్ ఏజెన్సీ పేర్కొంది. ఫైజర్ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో మొత్తం 29 మంది సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడగా.. 13 మంది మరణించినట్టు ఏజెన్సీ నివేదించింది. 21 మంది మహిళలు, 8 మంది పురుషులు సైడ్ ఎఫెక్ట్స్ బాధపడినట్టు అధికారులు పేర్కొన్నారు.

మిగిలిన 9 మందిలో సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉన్నట్టు తెలిపారు. వారిలో ఎక్కువగా అలర్జీ సమస్యలు, వాంతులు, వికారం, జ్వరం, టీకా వేసిన చోట తీవ్రమైన నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. నార్వేలో ఇప్పటివరకూ మొత్తంగా 57వేల కరోనా కేసులు నమోదు కాగా, 500 వరకు కరోనా మరణాలు నమోదయ్యాయని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్శిటీ రిపోర్టు పేర్కొంది.