కరోనా బాధితులకు గుడ్ న్యూస్ : వైరస్ సోకిన 5 చిన్నారులకు తగ్గింది!

  • Published By: sreehari ,Published On : February 7, 2020 / 06:33 AM IST
కరోనా బాధితులకు గుడ్ న్యూస్ : వైరస్ సోకిన 5 చిన్నారులకు తగ్గింది!

కొత్త కరోనా వైరస్ సోకిన ఐదుగురు చిన్నారులకు వ్యాధి తగ్గిపోయినట్టు ఓ రిపోర్టు వెల్లడించింది. సెంట్రల్ చైనాలోని హుబెయ్ ప్రావిన్స్ రాజధాని వుహాన్ సిటీలో ఓ ఆస్పత్రి నుంచి వైరస్ ప్రభావం తగ్గిన చిన్నారులు డిశ్చార్చి కూడా అయ్యారట. వుహాన్ పిల్లల ఆస్పత్రి కథనం ప్రకారం.. కరోనా వైరస్ సోకిన ఐదుగురు చిన్నారుల్లో వారి వయస్సు 2 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుంది.

వైరస్ ప్రభావం తగ్గినప్పటికీ మరో రెండు వారాల పాటు ప్రత్యేక వార్డులో ఉంచనున్నట్టు జిన్హువా రిపోర్టులో తెలిపింది. చిన్నారుల్లో వైద్య నిరోధక వ్యవస్థ పూర్తి స్థాయిలో లేదని, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లతో పాటు ఇతర లక్షణాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందనే అనుమానంతో వారిని కొన్ని రోజులు నిర్బంధంలో ఉంచకతప్పదని ఆస్పత్రి వైద్యులు ఫాంగ్ యురోంగ్ మీడియా ఏజెన్సీ ఐఏఎన్ఎస్‌తో చెప్పారు. 

మరోవైపు కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. రోజురోజుకీ కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతుపోతోంది. చైనాలో ఇప్పటివరకూ కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 600కు చేరింది. శుక్రవారం ఉదయానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 31,240కు చేరింది.

అందులో చైనా ప్రధాన భూభాగంలోనే 31,000 మంది వైరస్ బాధితులు ఉన్నారు. చైనాలో పెరిగిన వైరస్ కేసులు 3,143 కాగా, అంతకుముందు రోజు 11శాతంగా నమోదైంది. చైనా మెయిన్ ల్యాండ్‌ తోపాటు ఫిల్పిఫ్పైన్స్, హాంగ్ కాంగ్ కలిపి మొత్తంగా 638మంది మరణించారు.